
నరసరావుపేట: రాజ్యాంగంలోని అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు రచించిన భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాన్ని గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా రచించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం, అందులోని అంశాలపై అవగాహన కలిగి ఉండాలనే లక్ష్యంతో రచించిన పుస్తకాన్ని విద్యార్థులంతా తప్పకుండా చదవాలని కోరారు. రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలతో పాటు రచన కమిటీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చేసిన అమూల్యమైన కృషిని పుస్తకంలో ప్రస్తావించారు. రాజ్యాంగంపై విద్యార్థుల్లో మరింత విశ్వాసం, నమ్మకం పెంపొందించడమే లక్ష్యంగాని రచించిన పుస్తకాన్ని లాభాపేక్షకు తావులేకుండా విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. నామమాత్రపు రుసుముతో లభ్యమయ్యే రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాన్ని విద్యాలయాల్లో లభ్యమయ్యేలా కృషి చేయాలని కలెక్టర్‌ను ఎమ్మెల్సీ కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్ కుమార్, జి. విజయసారథి పాల్గొన్నారు.
జగన్నాథునికి
పంచామృత అభిషేకం
ముప్పాళ్ళ: చాగంటివారిపాలెంలో వేంచేసియున్న సుభద్ర బలభధ్ర సహిత జగన్నాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం మొదటి రోజు పంచామృత అభిషేకం నిర్వహించారు.
శతాధిక వృద్ధురాలు మృతి
యడ్లపాడు: యడ్లపాడు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు పోపూరి తిరుపతమ్మ (102) బుధవారం రాత్రి ఆమె స్వగృహంలో మృతిచెందారు. ఆమెకు కుమారుడు కాళిదాసు, కుమార్తె సామ్రాజ్యమ్మతోపాటు మనుమలు, మనుమరాండ్లు, ముది మనుమలు, ఇలా ఐదు తరాలను ఆమె చూశారు. భర్త పోపూరి వెంకటేశ్వర్లు సుమారు 25 సంవత్సరాల కిందట మృతి చెందాడు. తిరుపతమ్మకు 102 సంవత్సరాలు వచ్చినప్పటికీ బీపీ, షుగర్, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు ఏమీ లేవు. మందులు కూడా వాడేది కాదు. ఇప్పటికీ మంచాన పడకుండా తన పనులను తానే చేసుకుంటూ సాధారణ మృతి చెందింది.
నేడు స్టాఫ్‌నర్సులకు ప్రమోషన్ కౌన్సెలింగ్
గుంటూరు మెడికల్ : ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్టాఫ్‌నర్సులుగా పనిచేస్తున్న 14 మందికి హెడ్‌నర్సులుగా ప్రమోషన్ కౌన్సెలింగ్ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ జి.శోభారాణి తెలిపారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆర్డీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే ప్రమోషన్ కౌన్సెలింగ్ కు జోన్ –3లో ప్రమోషన్‌కు అర్హత ఉన్న 14 మంది స్టాఫ్‌నర్సులు హాజరు కావాలన్నారు.
నిదానంపాటి అమ్మవారి ఆదాయం రూ.12 లక్షలు
దుర్గి: అడిగొప్పల నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి హుండీ కానుకలు లెక్కించగా రూ.12,01,375ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సైదమ్మ బాయి తెలిపారు. గురువారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల ఆధ్వర్యంలో 44 రోజుల పాటు భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు చేపట్టారు. కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు అధికారులకు అందజేసి సంబంధిత రసీదును తీసుకున్నట్లు అధికారులకు వివరించారు. ఈ నెల 24న ఆదివారం అమ్మవారి తిరునాళ్ల జరపనున్నట్లు పేర్కొన్నారు. వినుకొండ గ్రూప్ టెంపుల్స్ ఈఓ కొల్లి హనుమంతరావు, కరాలపాటి సుబ్బారావు, పాండురంగారావు, కలవల వెంకటేశ్వర్లు, ఎన్‌ఎంఆర్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.



తిరుపతమ్మ(ఫైల్)