వాసవీ అమ్మవారికి 15 కిలోల వెండి వస్తువులు బహూకరణ
పిడుగురాళ్ల: పట్టణంలోని జానపాడు రోడ్డులోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారికి సుమారు 15 కిలోల వెండి వస్తువులను పట్టణానికి చెందిన పెరుమాళ్ల రాజేష్, వనజా లక్ష్మి దంపతులు గురువారం బహూరించారు. అందులో శ్రీ చక్రం ప్లేటు, కూర్మం, సప్త హారతులు, ఏకహారతి, గంటలను వెండితో తయారు చేయించి అందించారు. వీటి విలువ సుమారు రూ.12.5 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, భక్తులు పాల్గొన్నారు.
కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం
అచ్చంపేట: మండల పరిధిలోని మాదిపాడు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. మాదిపాడు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన రూ.62 లక్షల నాబార్డు నిధులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. 2023 జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్రిడ్జి నిర్మాణానికి క్రోసూరులో వర్చువల్‌గా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. మళ్లీ ఇన్ని రోజులకు బ్రిడ్జి నిర్మాణ పనులను కొనసాగించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల మధ్య రాకపోకలను సుగమం చేయాలని కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సులో చోరీ
ప్రయాణికురాలి పర్సు కత్తిరించి రూ.2 లక్షల అపహరణ
నరసరావుపేటటౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి పర్సు కత్తిరించి రూ.2 లక్షల నగదు అపహరించిన ఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన కొడవలి సుజాత గుంటూరు వెళ్లేందుకు స్వగ్రామం నుంచి నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చారు. బస్సు దిగి మరో బస్సు ఎక్కి చూసుకోగా పర్సులో ఉండాల్సిన నగదు కనిపించలేదు. పర్సు కింది భాగం కత్తిరించబడి ఉంది. సమాచారం అందుకున్న సీఐ విజయ్‌చరణ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. ఈ మేరకు బాధితురాలిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
యార్డులో 1,09,020 మిర్చి బస్తాలు విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 1,02,729 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,09,020 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.7,000 నుంచి రూ.15,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.7,000 నుంచి రూ.15,000 వరకు ధర లభించింది. ఏసీ కామన్ రకం రూ.7,500 నుంచి రూ.13,000 వరకు ధర పలికింది. ఏసీ ప్రత్యేక రకాలకు రూ.8,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.10,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 68,402 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు తెలిపారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద గురువారం 2010 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 118, బ్యాంక్ కెనాల్‌కు 138, తూర్పు కెనాల్‌కు 244, పశ్చిమ కెనాల్‌కు 122, నిజాంపట్నం కాలువకు 51, కొమ్మమూరు కాలువకు 945 క్యూసెక్కులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment