● వైఎస్సార్ సీపీ జెండాపై గెలిచిన వారిని ప్రలోభాలకు గురి చేసి తీసుకెళ్తున్నారు ● కేంద్రమంత్రి పెమ్మసాని వ్యాఖ్యలకు అంబటి కౌంటర్
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపు కోసం కార్పొరేటర్లను టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ సంతలో పశువుల్లా కొంటున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి కార్పొరేటర్లు ఇంకా లైన్లో ఉన్నారన్న కేంద్రమంత్రి పెమ్మసాని వ్యాఖ్యలకు స్పందించిన అంబటి తాను.. లేళ్ళ అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్‌నాయుడు, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కూడా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దిమాక్ లేదా అంటూ తమపై చేసిన వ్యాఖ్యలపై అంబటి ఘాటుగా స్పందించారు. అవును మాకు దిమాక్ లేదని.. టీడీపీ నేతలకు ఉంటే సూపర్‌సిక్స్ అమలు చేయాలని హితవు పలికారు. పెమ్మసాని కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని.. ఇదీ తాను ఇచ్చే ఉచిత సలహా అని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల ఇంటికి సంచులు పట్టుకుని తిరుగుతున్నారని, ఈ లిస్ట్‌లో పెమ్మసాని కూడా చేరారా అని ప్రశ్నించారు. కేవలం అభివృద్ధి చూసే కార్పొరేటర్లు పార్టీ మారారని దేవుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాల్ విసిరారు. మేయర్‌ను అనైతికంగా దించే యత్నాలు చేయటం సిగ్గుచేటన్నారు. ప్రజలు ఎన్నుకున్న మేయర్ పీఠం కోసం నీచ రాజకీయాలు చేసేందుకు టీడీపీ నేతలు వెనుకాడకపోవటం సిగ్గుచేటన్నారు. నైతిక విలువలు లేకుండా రాజకీయాలు చేసే టీడీపీ నేతలకు వైఎస్సార్ సీపీని విమర్శించే స్థాయి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment