క్వారీ తిరునాళ్లు సజావుగా నిర్వహిద్దాం
● ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకోండి ● సమన్వయ సమావేశంలో సబ్‌కలెక్టర్ సంజనా సింహ
తెనాలి: తెనాలి–గుంటూరు రోడ్డు మార్గంలో వడ్లమూడి వద్ద క్వారీలోని శ్రీబాలకోటేశ్వరస్వామి తిరునాళ్లు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేయాలని తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహ ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అందుకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జరిగిన నమన్వయ సమావేశానికి సబ్‌కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షత వహించారు. తిరునాళ్లు జరిగే విధానం, అవసరమైన ఏర్పాట్లు, భక్తులు, సందర్శకుల రాక తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులనడిగి తెలుసుకున్నారు. డీజేల్లో విపరీతమైన శబ్దాల వల్ల గతంలో ఒక అధికారి మృత్యువాత పడ్డారని చెప్పగా, డీజేల శబ్ద కాలుష్యాన్ని కచ్చితంగా తగ్గించాలని ఆదేశించారు. తిరునాళ్లలో ఉంచే జెయింట్ వీల్స్, గ్రామాల నుంచి వచ్చే భారీ ప్రభలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని చెప్పారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీబాలకోటేశ్వరస్వామి తిరునాళ్లకు 60 వేలమందికిపైగా భక్తులు/ప్రజలు సందర్శిస్తారన్న అంచనా ఉందని ఆలయ కార్యనిర్వహణాధికారి రామకోటేశ్వరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 24,25,26 తేదీల్లో తిరునాళ్ల ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ డిపో నుంచి మొత్తం 45 బస్సులు ప్రతి నాలుగు నిముషాలకొకటి చొప్పున తెనాలి–గుంటూరు నడుమ రాకపోకలు సాగిస్తాయని ఆర్టీసీ, తెనాలి డీఎం రాజశేఖర్ చెప్పారు. మంచినీరు, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లను చూస్తామని డివిజనల్ పంచాయతీ అధికారిణి స్వరూపరాణి చెప్పారు. ప్రభలపైనా, తిరునాళ్ల ప్రదేశంలో దేవుడి బొమ్మలు మినహా కోడ్ నేపథ్యంలో రాజకీయ నేతల ఫొటోలు ఉండకుండా చూడాలని సబ్‌కలెక్టర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment