హామీలు ఎగ్గొట్టేందుకే బాబు తప్పుడు ప్రచారం
● మా నాయకుడు జగన్ జనం కష్టాలు తీర్చారు ● ఆది నుంచి చంద్రబాబుది వంచన నైజం ● ‘సాక్షి’తో వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున
సాక్షి ప్రతినిధి, బాపట్ల: సూపర్‌సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకే సీఎం చంద్రబాబు వైఎస్సార్‌సీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ ఆరోపణలకు దిగారని, కథలు, కహానీలు, కాకిలెక్కలు, తప్పుడు ప్రచారాలు పక్కనబెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడారు. చంద్రబాబు తప్పుడు లెక్కలు చెప్పినా కాగ్ లెక్కలు, అధికారిక గణాంకాలను ఎవరూ దాచిపెట్టలేరన్నారు. బాబు దృష్టిలో సంపద సృష్టించడమంటే బాదుడే బాదుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలల్లోనే రూ.15 వేల కోట్లకు పైగా విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు. భావి తరాల కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సృష్టించిన విలువైన సంపద లాంటి మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రైవేటుకు బేరం పెడుతున్నారని విమర్శించారు. ఇవన్నీ దాచిపెట్టి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఒక ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు మూలధన వ్యయం, అప్పుల వృద్ధి తీరును కొలమానంగా పరిగణిస్తారని లెక్కలన్నీ చూశాక ఆర్థిక క్రమశిక్షణతో ఎవరు పాలన సాగించారో ప్రతి ఒక్కరూ చెబుతారన్నారు. 2023–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యధికంగా మూలధన వ్యయం వేసిందని, దాన్ని వదిలేసి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు చేయాల్సిన పనికాదని విమర్శించారు. గతంలో చంద్రబాబు హయాంతో పోలిస్తే వైఎస్పార్‌సీపీ ఐదేళ్ల పాలనలో తక్కువగా అప్పులు చేయడమే కాకుండా మూలధన వ్యయం అధికంగా చేసిందన్నారు. 2022–23లో వైఎస్సార్‌సీపీ రూ.67.265 కోట్లు అప్పు చేసి మూలధన వ్యయం రూ.7244 కోట్లు మాత్రమే చేసిందని చంద్రబాబు తప్పుబట్టారని, మరి ఈ ఆర్థిక ఏడాదిలో రూ.78,635.82 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు మూలధన వ్యయం రూ.8,894.98 కోట్లే చేసిన విషయాన్ని ఎందుకు దాచి పెడుతున్నారని మేరుగ ప్రశ్నించారు. డీబీటీ ద్వారా నేరుగా రూ. 2.73 లక్షల కోట్లు ప్రజలకు పారదర్శకంగా అందించిన పాలకుడు విధ్వంసకారుడా? ఐదేళ్లలో ఏమీ చేయకుండా మాటలతో మభ్యపెట్టి సింగపూర్ గ్రాఫిక్స్ చూపిన నాయకుడు విధ్వంసకారుడా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఉద్యోగాలు, ఆర్‌బీకేలు, ఆస్పత్రులు, ఇంగ్లిషు మీడియం స్కూళ్లు తెచ్చిన వ్యక్తి విజన్ ఉన్న వారు లీడరా? 14 ఏళ్లు పాలించినా ఏ ఒక్క పథకం నాది అని చెప్పుకోలేని దుస్టితిలో ఉన్న వ్యక్తి విజనరా? అని ప్రశ్నించారు. ఇప్పటికై నా చంద్రబాబు కాకిలెక్కలు చెప్పడం మాని ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment