మహిళా సాధికారతకు కృషి చేయాలి
గుంటూరు వెస్ట్: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర మహిళ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిర్వహించిన వర్చువల్ సమావేశానికి స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తోపాటు, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ సుప్రజ పాల్గొన్నారు. అనంతరం జరిగిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళ సాధికారత జీవనోపాధి, మెరుగు దలకు ప్రభుత్వం నిర్ధేశించిన కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. మహిళ దినోత్సవ వేడుకలు ఈనెల 8న స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తల అమ్మకాలకు రూపొందించి ఈ– కామర్స్ యాప్ ద్వారా కొనుగోలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి మెరుగు పరిచేందుకు ఈ–బైక్, ఈ–ఆటో, ఇతర స్వయం ఉపాధి పథకాల ద్వారా మంజూరు చేసిన యూనిట్లు, మహిళ దినోత్సవం నాటికి గ్రౌండింగ్ జరిగేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల ద్వారా మహిళ సంక్షేమం, ఆర్ధికాభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. మహిళ రక్షణకు అమలు చేస్తున్న కార్యక్రమాలపై పోలీసు శాఖ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. దీంతోపాటు, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల ద్వారా ఆర్ధికాభివృద్ధి సాధించిన మహిళలకు సన్మానం కార్యక్రమం చేపట్టాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాబాయి, మహిళ అభివృద్ధి సంక్షేమ శాఖ పీడీ ఉమాదేవి, మెప్మా పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment