రుణాల ఊబిలో టిడ్కో గృహ లబ్ధిదారులు
లక్ష్మీపురం: టిడ్కో గృహాల లబ్ధిదారులను ప్రభుత్వం రుణాల ఊబిలోకి నెట్టిందని, గృహ సముదాయాలలో మౌలిక సదుపాయాలూ కల్పించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు విమర్శించారు. సీపీఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం గుంటూరు నగరంలోని అడవితక్కెళ్లపాడులో ఉన్న టిడ్కో గృహ సముదాయాలను బాబురావు, నగర కార్యదర్శి కె. నళిని కాంత్, ఇతర నగర నాయకులు సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. లబ్ధిదారులు బ్యాంకుల నుంచి రూ.3.50 లక్షల రుణం తీసుకుంటే 15 నుంచి 20 ఏళ్ల కాలంలో దాదాపు రూ.10.50 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోందన్నారు. అసలు కంటే వడ్డీ అధికంగా ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా ఇల్లు ఇస్తామని చేసిన వాగ్దానం అమలు కాలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీ నిలబెట్టుకొని లబ్ధిదారుల రుణాలను వడ్డీ సహా భరించాలని కోరారు.
కనీస వసతులు కల్పించాలి
గృహ సముదాయాల వద్ద వసతులు లేవని బాబురావు పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఆరు కుటుంబాలకు సరిపోయే నీళ్ల ట్యాంక్ నిర్మించి, 16 కుటుంబాలకు సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. అది కూడా రోజు మార్చి రోజున గంటసేపు మాత్రమే నీళ్లు వస్తున్నాయని తెలిపారు. చాలాసార్లు కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. తాగటానికి ఉపయోగపడట్లేదని నాయకులకు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, ముళ్ల చెట్లను తొలగింపజేయాలని కోరారు. డిపాజిట్ చెల్లించినా ఇల్లు కేటాయించలేదని, రిజిస్ట్రేషన్ చేయలేదని, కానీ వడ్డీ కోసం బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
యాత్రలను జయప్రదం చేయండి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబురావు
లక్ష్మీపురం: ఈ నెల 17వ తేదీ వరకు జరిగే ప్రజాచైతన్య యాత్రలను జయప్రదం చేయాలని, సమస్యలను యాత్ర బృందానికి తెలపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్.బాబురావు కోరారు. బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాయలంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రజాసమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి దశల వారీగా ఆందోళన చేయునున్నట్లు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, ఎ్.భావన్నారాయణ, ఎం.రవి, కె.నళినీకాంత్, బూరగ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు డి.శ్రీనివాసకుమారి, ఎల్.అరుణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment