
శుభాల షబ్–ఏ–ఖదర్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): పరిపూర్ణ మనసుతో మన్నింపు కోరుకునే అవకాశం రంజాన్ మాసంలో ముస్లింలకు దక్కుతుంది. చేసిన పాపాలను మనిషి మనస్ఫూర్తిగా ఒప్పుకుని పశ్చాత్తాపంతో క్షమాపణ కోరితే దైవం తప్పక అనుగ్రహిస్తాడని ఖురాన్‌లో ఉంది. వేయి నెలల ప్రార్థనల పుణ్యఫలాన్ని ఒక్క రాత్రిలో అందించే షబ్–ఏ–ఖదర్ గురువారం జరగనుంది. రంజాన్ మాసంలో ఈ రాత్రికి ప్రత్యేకత ఉంది. 26 రోజుల కఠోర ఉపవాస దీక్షలు పూర్తయిన తరువాత ఆఖరి మూడు రోజులకు ముందు వచ్చే షబ్–ఏ–ఖదర్ రాత్రి చాలా పవిత్రమైందని గ్రంథాల్లో(హదీసులు) ఉంది. ఈ రాత్రి చేసే ప్రత్యేక నమాజ్‌లు, ఆరాధనలు, ప్రత్యేక ప్రార్థనలు తప్పక అనుగ్రహం పొందుతాయని చెబుతారు. షబ్–ఏ–ఖదర్ తర్వాత ఆఖరి మూడు రోజుల ఉపవాస దీక్షలు(సతామీ) ప్రారంభమవుతాయి. రంజాన్ నెల ప్రారంభం నుంచి ఉపవాస దీక్షలు ఉండలేని వారు ఈ ఆఖరి మూడు రోజులు మాత్రం తప్పండా ఆచరిస్తారు.
పేదల హక్కు జకాత్
ఇస్లాంకు ఉన్న ఐదు మూల స్తంభాలలో జకాత్ ఒకటి. ఇది ఆరాధనలో రెండో విధి. ఇస్లాం పవిత్ర గ్రంథంలో జకాత్ గురించి ప్రస్తావన కనీసం 32 సార్లు ఉంది. దీన్నిబట్టి జకాత్‌కు ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థమవుతోంది. ఇది పేదల హక్కు. అవసరార్థులకు జకాత్ చెల్లించే సదాచారుల కోసం దేవుని వద్ద ప్రతిఫలం సిద్ధంగా ఉంటుందని హదీసులలో పేర్కొనబడింది. ప్రతి ముస్లిం తన సంపాదనలో రెండున్నర శాతం పేదలకివ్వాలన్నది జకాత్ ఉద్దేశం. నమాజ్ వలే ఇది కూడా తప్పనిసరి నియమం. ఇస్లాంను ఆచరించేవారు దీనిని విస్మరించరాదు.
రంజాన్ మాసంలో నేడు ప్రత్యేకమైన రాత్రి ప్రత్యేక ప్రార్థనలకు సిద్ధమవుతున్న ముస్లింలు వేయి నెలల ప్రార్థనల పుణ్యం ఒక్కరోజులోనే.. జకాత్‌కు అమిత ప్రాధాన్యం పేదలకు సంపాదనలో 2.5శాతం ఇవ్వడం ఆనవాయితీ
దానం బాధ్యత
రంజాన్ మాసంలో దానధర్మాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. పేదలకు సాయం చేయడం ముస్లింల బాధ్యత. పేదలూ సంతోషంగా పండగ జరుపుకోవడానికి ఈ విధానం దోహదపడుతుంది. రంజాన్ మాసంలో సాయం, దానం చేయడం ఎంతో పుణ్యం.
– ముఫ్తి సమీయుజమా
హబీబీ, ముస్లిం మత గురువు

శుభాల షబ్–ఏ–ఖదర్
Comments
Please login to add a commentAdd a comment