
చట్టబద్ధంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి
అమరావతి: పల్నాడు జిల్లాలోని అమరావతి – బెల్లంకొండ రోడ్డు విస్తరణ పనులు ఇటీవల రెండు నెలలుగా ధరణికోట, అమరావతి పరిధిలోని గ్రామాలలో చేపట్టారు. పలువురు గ్రామస్తులు అభ్యంతరం తెలిపినా ఆర్ అండ్ బీ అధికారులు ఇష్టారాజ్యంగా నోటీసులు, నష్ట పరిహారాన్ని ఇవ్వకుండానే భవనాలను, ఇళ్లను కూలుస్తున్నారు. కట్టా రాధికాదేవి సహా మరికొందరు అధికారుల వైఖరిపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రక్రియను చట్టబద్ధంగా కొనసాగించాలని కోరుతూ పిటిషనర్లు తరఫున న్యాయవాది కోడె రమేష్ బుధవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి... ఆర్ అండ్ బీ శాఖ చట్టబద్ధంగా సర్వే నిర్వహించి, సంబంధికులకు నోటీసులు జారీ చేయాలన్నారు. చట్ట ప్రకారం ప్రక్రియను అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాది బాలాజీని హైకోర్టు ఆదేశించింది. దీినిపై పలువురు ఇళ్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. లేకుంటే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఆర్టీసీలో నిలిచిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి
చీరాల అర్బన్: ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. డిపో అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రవిబాబు, పి.దయాబాబులు మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అలానే ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఈఓఎల్‌లు మంజూరు చేయాలని, ఈహెచ్‌ఎస్ స్థానంలో పాత వైద్యవిధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని, నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 114 జీవోలో పొందుపరచిన మేరకు నైట్ అవుట్ అలవెన్సులను రూ.150 నుంచి రూ.400 వరకు చెల్లింపులు చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డెలిగేట్ డి.ప్రవీణ్‌కుమార్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
చీరాల కేంద్రంగా గోవా మద్యం
చీరాల: చీరాల కేంద్రంగా గోవా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. రైళ్లలో గోవా నుంచి చీరాల వాడరేవు, తీర ప్రాంతాలకు తరలించి రిసార్టులకు విక్రయిస్తున్నారు. ఇది చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. గురువారం సమాచారం అందుకున్న ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎకై ్సజ్ పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గోవా మద్యం నిల్వ ఉంచిన స్థావరాలపై దాడులు నిర్వహించారు. వాడరేవు వైఎస్సార్ కాలనీకి చెందిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.55 వేలు విలువ చేసే 550 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసీ విజయ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా నాన్ డ్యూటీ మద్యంను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలా తరచూ మద్యం తరలించిన వారిపై కఠినమైన చట్టాలను ఉపయోగిస్తామన్నారు. దాడులలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఒంగోలు సీఐ రామారావు, చీరాల ఎకై ్సజ్ సీఐ పి.నాగేశ్వరరావు, ఎస్సైలు బి.శ్రీహరి, రమాదేవి, రాజేంద్రప్రసాద్, టూటౌన్ ఏఎస్సై టి.వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

చట్టబద్ధంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి