
ఉపాధ్యాయుల కేటాయింపుల్లో అసమానతలు సరిదిద్దాలి
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపుల్లో నెలకొన్న అసమానతలను సరిదిద్దాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీల చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చట్టంలో పొందుపర్చిన అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలను నాలుగు రకాలుగా విభజించిన ప్రభుత్వం, విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తిని వేర్వేరుగా నిర్ణయించడం తగదన్నారు. ఫౌండేషన్ స్కూల్లో 30 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు, మోడల్ ప్రైమరీ స్కూల్లో 20 మంది పిల్లలకు ఒకరు, హై స్కూల్ ప్రైమరీలో 10 మంది పిల్లలకు ఒక్కరు చొప్పున కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. అన్ని పాఠశాలల్లో కేటాయింపులు ఒకే విధంగా ఉండాలని అందరికీ ఒకే రకమైన నాణ్యమైన విద్య అందాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి మాట్లాడుతూ యూపీ పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను కేటాయించాలని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి మోడల్ ప్రాథమిక పాఠశాలకు ఐదుగురు ఉపాధ్యాయులను తప్పనిసరిగా కేటాయించాలని అన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల లభ్యతను బట్టి విద్యా విధానాన్ని మార్పులు చేయటం తగదన్నారు. దీనికి బుదులుగా ఒక ఉన్నతమైన విద్యా విధానాన్ని రూపొందించి, దానికి తగ్గట్టు ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. అవగాహన సదస్సులో జిల్లా గౌరవ అధ్యక్షుడు పీవీ శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, వై.నాగమణి, జిల్లా కోశాధికారి ఎండీ దౌలా, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, ఎం. గోవిందు, ఎండీ షకీలా వేగం, కె.రంగారావు, బి.ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.