
అనాథలా వదిలేస్తే అక్కున చేర్చుకున్న ఆశ్రమం
తెనాలి: అందరూ ఉండీ అనాథలా ఆసుపత్రికి చేరిన అభాగ్యుడి దయనీయ స్థితిపై ‘మానవత్వమా...నీ జాడెక్కడా’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. తన పేరు, ఊరు చెబుతున్న రాధాకృష్ణమూర్తి అనే అరవై ఏళ్ల వృద్ధుడిని ఎవరో తీసుకొచ్చి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేసి వెళుతున్నారు. ఒంటిపై దుస్తులు కూడా లేకుండా గొడవ చేస్తున్న అతడిని ఆసుపత్రి సిబ్బంది ఐసోలేషన్ రూములో పడేశారు. ‘హెల్పింగ్ సోల్జర్స్’ సంస్థ బాధ్యులు అతడి పరిస్థితిని చూసి వస్త్రం కప్పి, ఆహారం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచనతో మున్సిపల్ ఆరోగ్య అధికారిణి డాక్టర్ హెలెన్ నిర్మల, మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణితో చర్చించారు. అనంతరం గుంటూరు రూరల్ మండలం గోరంట్లలోని కారుణ్య ఆశ్రమాన్ని సంప్రదించారు. రాధాకృష్ణమూర్తితోపాటు ఆసుపత్రిలోని మరో గుర్తుతెలియని వ్యక్తిని కూడా ఆశ్రమానికి తరలించామన్నారు.

అనాథలా వదిలేస్తే అక్కున చేర్చుకున్న ఆశ్రమం