వరంగల్‌లో అమెరికా దంపతుల దత్తత వివాదం.. ఎయిర్‌పోర్టులో అడ్డుకోవడంతో | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో అమెరికా దంపతుల దత్తత వివాదం.. ఎయిర్‌పోర్టులో అడ్డుకోవడంతో

Published Tue, Jul 11 2023 11:38 AM | Last Updated on Tue, Jul 11 2023 12:06 PM

- - Sakshi

సాక్షి, వరంగల్‌: అమెరికా దంపతులు.. వరంగల్‌కు చెందిన ఓ ఆరేళ్ల శిశువును దతత్త తీసుకునే అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆ పాపకు జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు ఏకంగా వీసా తీసుకుని అమెరికాకు తీసుకెళ్లేందుకు మూడు నెలల క్రితం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నిరాకరించారు. ఆ తర్వాత జరిగిన దత్తత విధానమే ఇప్పుడూ అనుమానాలకు తావిస్తోంది.

ఆ పాపను దత్తత ఇచ్చే విధానాన్ని వేగిరం చేయాలని కొందరు స్టేట్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ ఆథారిటీ(సారా) అధికారులతో పాటు శిశు గృహ సందర్శన నివేదికను సమర్పించాలంటూ హనుమకొండ జిల్లా సంక్షేమ శాఖలోని ఓ విభాగాధికారి ఒకరు అత్యుత్సాహం చూపారనే విమర్శలున్నాయి. వాస్తవానికి ఆ పాప వరంగల్‌ సిటీకి చెందినట్లు జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్నా.. ఆ శిశువును దత్తత తీసుకునేందుకు ఆన్‌లైన్‌ ద్వారా హనుమకొండలోని బాలల సంరక్షణ విభాగానికి దరఖాస్తు వచ్చింది. దీంతో వరంగల్‌ జిల్లాలో దత్తత కార్యక్రమాలను పర్యవేక్షించే వారిని గృహ సందర్శన చేసి నివేదిక సమర్పించాలంటూ అడిగినట్లు తెలిసింది.

అక్కడా కుదరదనే...ఇక్కడకు వచ్చి..
అమెరికాకు చెందిన దంపతులు కరీం విరాణి, అశామా విరాణి అమెరికా నుంచి వచ్చి కొంపల్లిలో తాత్కాలిక నివాసం ఉంటున్నారు. వాస్తవానికి ఇంటర్‌ కంట్రీ అడాప్షన్‌ (ఓఏఎస్‌) చిల్డ్రన్‌ కోసం ఫారెన్‌ అడాప్షన్‌ ఏజెన్సీ(ఏఎఫ్‌ఏ) నోఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ) సంబంధిత దేశం ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీవివిధ దేశాల్లో ఉన్న ఎంబసీలోని ఫారెన్‌ అథరైజ్డ్‌ ఏజెన్సీ (ఆపా) వద్ద పిల్లలు దత్తత కావాలని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అక్కడా వారి స్థితిగతులను అధ్యయనం చేశాకే ఆ దంపతులను కారాలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఆపా కోరుతుంది. అయితే కరీం, అశామీ విరాణి విషయంలో ఆపాను సంప్రదిస్తే అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం బతికున్న తల్లిదండ్రుల నుంచి పిల్లలను దత్తత తీసుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది.

అందుకే హైదరాబాద్‌కు వచ్చిన వీరు ఇన్నర్‌ కంట్రీ అడాప్షన్‌ అనే ఆప్షన్‌ ద్వారా కారాలో దరఖాస్తు చేసుకున్నారు. కరీం విరాణి కొంపల్లిలో తాత్కాలిక నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి..తన సోదరి, వరంగల్‌కు చెందిన రషీదాబాను భోజని శిశువును దత్తత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి అమ్యన్‌ అలీ భోజని, రషీదాబాను భోజని దంపతులకు 10, 8 ఏళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గతేడాది ఆమె గర్భవతి కాలేదని సమాచారం. దీంతో ఆ పాప ఎక్కడి నుంచి వచ్చింది...ఎవరి పాప...కొనుగోలు చేశారా అనే దిశగా అనుమానాలు వస్తున్నాయి.

వీరు రారు.. వారు రారు..
వరంగల్‌కు చెందిన అడ్వకేట్‌ కృష్ణ ద్వారా ఈ దంపతులకు సంబంధించి దత్తత ఆదేశాలు ఇవ్వాలంటూ కలెక్టర్‌ ద్వారా జిల్లా సంక్షేమ అధికారికి కొద్దిరోజుల క్రితం పిటిషన్‌ వచ్చింది. దీనిని పరిశీలించిన జిల్లా బాలల సంరక్షణ విభాగం.. ఇంటర్‌ కంట్రీ అడాప్షన్‌ పేరేంట్స్‌ (పాప్స్‌) కిందకు వస్తుందంటూ చెబుతూనే..అథరైజ్డ్‌ ఫారెన్‌ అడప్షన్‌ ఏజెన్సీ(ఏఎఫ్‌ఏ) నుంచి నిరంభ్యంతర పత్రం సమర్పించాలన్నారు. దీని ఆధారంగానే దత్తతను ముందకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

అయితే పాప కోసం దరఖాస్తు చేసుకున్న విరాణి దంపతులు, ఆ పాప బయోలాజికల్‌ పేరెంట్స్‌ అయిన భోజని దంపతులు చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరు కాలేదు. ఇంకోవైపు శ్రీహోమ్‌ స్టడీ రిపోర్ట్‌శ్రీ ఇవ్వాలని లోకల్‌ రాజకీయ నేతల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. వరంగల్‌ చార్‌బౌలీకి చెందిన ఫిజియో థెరపీ షర్మిలా.. దత్తత విషయంలో పలుమార్లు అధికారులను కలిశారు. వరంగల్‌ ఎంపీ పసనూరి దయాకర్‌ అనుచరుడినంటూ శ్రీనివాస్‌ గౌడ్‌ కూడా ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. అయితే రషీదాబాను గర్భవతి కాకపోతే ఆ పాప ఎవరనే అనుమానం కలుగుతోంది. దీన్ని నిగ్గు తేల్చే దిశగా అధికారులు దృష్టి సారించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement