హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ చరిత్ర సృష్టించింది. నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాణికుల సంఖ్య 40 కోట్లకు చేరుకుంది. 2017 నవంబర్ 29న నగరంలో మెట్రో సేవలను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తొలుత నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు మెట్రో రైలు పరుగులు తీసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఎల్‌బీనగర్ నుంచి అమీర్‌పేట్ మీదుగా మియాపూర్ వరకు.. నాగోల్ నుంచి అమీర్‌పేట్ మీదుగా రాయదుర్గం వరకు మెట్రో రైళ్లు పరుగులు తీశాయి. అదేవిధంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో అందుబాటులోకి వచ్చింది. దశలవారీగా ప్రయాణికుల రద్దీతో పాటే ట్రిప్పుల సంఖ్య సైతం పెరిగింది. ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సుమారు వెయ్యి ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ మార్గాల్లో ట్రిప్పుల సంఖ్యను పెంచేందుకు హెచ్‌ఎంఆర్ చర్యలు చేపట్టింది.
అంచెలంచెలుగా..
నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ప్రయాణికుల నుంచి ఆదరణ లభించింది. ఐటీ కారిడార్‌లకు రాకపోకలు సాగించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మెట్రో సేవలను గణనీయంగా వినియోగించుకున్నారు. క్రమంగా విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు మెట్రో శాశ్వత ప్రయాణికులుగా మారారు. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 4.90 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
త్వరలో ఈ సంఖ్య 5 లక్షలు దాటనున్నట్లు పేర్కొన్నారు. రోజుకు 6.70 లక్షల మంది ప్రయాణం చేసేందుకు అనుగుణంగా మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రయాణికుల్లో ప్రతిరోజూ 1.20 లక్షల మంది విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. మరో 1.40 లక్షల మంది సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నట్లు ఎండీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment