సాక్షి, హైదరాబాద్: మెట్రో విస్తరణతో గ్రేటర్ హైదరాబాద్ రవాణా ముఖచిత్రం మారనుంది. నగరానికి నలుదిశలా మెట్రో సేవలను అందుబాటులోకి తేవాలని తాజాగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో సుమారు 7,220 చదరపు కిలోమీటర్ల పరిధిలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి మెట్రో మణిహారంగా పరుగులు తీయనుంది.
ఔటర్‌చుట్టూ మెట్రో, ఎంఎంటీఎస్ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణ సమయంలోనే ప్రత్యేకంగా కొంత భూమిని కేటాయించారు. దీంతో ఆ మార్గంలో మెట్రో విస్తరణపైన ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అన్ని వైపులా మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రజారవాణా వేగవంతమవుతందని, ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకై నా తేలిగ్గా రాకపోకలు సాగిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే రెండో దశకింద బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకాఫూల్ వరకు, నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు మెట్రో పొడిగించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అలాగే రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. మెట్రో మొదటిదశలో మిగిలిపోయిన ఎంజీబీఎస్–ఫలక్‌నుమా రూట్‌లో 5.5 కి.మీ.మార్గానికి లైన్ క్లియర్ అయింది.
ఈ లైన్ పూర్తయితే మొదటిదశలో ప్రతిపాదించిన 72 కిలోమీటర్ల మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వరకు విస్తరించాలనే ప్రతిపాదన ఉంది. అలాగే ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు కూడా మెట్రో విస్తరణపైన ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. 2021 నాటికే హైదరాబాద్ నగరానికి 200 కిలోమీటర్ల వరకు మెట్రో సేవలు అవసరమని లీ అసోసియేషన్ తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఈ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.
ఇవీ లీ అసోసియేషన్ ప్రతిపాదనలు ...
► హైదరాబాద్ మహానగర రవాణా రంగంపై 2011లోనే సమగ్రమైన అధ్యయనం చేపట్టిన లీ అసోసియేషన్ ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ప్రకారం 2041 నాటికి మహానగర జనాభా 2.5 కోట్లు దాటుతుంది. ఈ మేరకు భువనగిరి.సంగారెడ్డి, షాద్‌నగర్ వరకు సుమారు 420 కిలోమీటర్ల వరకు మెట్రో సదుపాయం కల్పించవలసి ఉంటుంది.
► మెట్రో నగరాల్లో కనీసం 20 శాతం రోడ్లు అందుబాటులో ఉండాలి. కానీ నగరంలో ప్రస్తుతం 5 శాతం రోడ్లే ఉన్నాయి. కానీ రోడ్లపైన ప్రతి రోజు సుమారు 75 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
► వేగంగా విస్తరిస్తున్న నగర అవసరాలకు అనుగుణంగా అంతేవేగవంతమైన రవాణా సేవలకు మెట్రో ఒక్కటే పరిష్కారం. 2011 నాటికే 72 కిలోమీటర్‌ల మేరకు మెట్రో సదుపాయం కల్పించాలని లీ అసోసియేషన్ స్పష్టం చేసింది.
ఎయిర్‌పోర్టు మెట్రోతో ఊరట...
రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు రూ.5 వేల కోట్లకు పైగా అంచనాలతో చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే కార్యాచరణవేగవంతమైంది. టెండర్ల ప్రక్రియ తుదిదశకు చేరుకుంది.
ప్రస్తుతం రెండు దిగ్గజ సంస్థలో పోటీలో ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ఎయిర్‌పోర్టు మెట్రోను దక్కించుకోనుంది. దీంతో ఈ ఏడాదిలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్టు మెట్రో విస్తరణ వల్ల కేవలం ప్రయాణికులకే కాకుండా జీవో 111 ప్రాంతాలకు కూడా మెట్రో అందుబాటులోకి వస్తుంది.
ఆ 38 కిలోమీటర్లు ఎంతో కీలకం...
అత్యధిక వాహన సాంద్రత కలిగిన మార్గాల్లో బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ వరకు ఉన్న మార్గం ఎంతో కీలకమైంది. ఈవైపు నుంచి ఆ వైపు చేరుకోవాలంటే కనీసం 3 గంటల సమయం పడుతుంది.
కానీ మెట్రో అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. అలాగే వాహనాల వినియోగం కూడా చాలావరకు తగ్గుతుంది. మెట్రో రెండోదశపైన ప్రభుత్వం ఇప్పటికే సమగ్రమైన నివేదికను సిద్ధం చేసింది.
నగరం నలువైపులా మెట్రో....
► ఇప్పటికే రెండో దశలో బీహెచ్‌ఈఎల్ నుంచి లకిడికాఫూల్ వరకు ప్రతిపాదించిన మార్గాన్ని అటు బీహెచ్‌ఈఎల్ నుంచి పటాన్‌చెరు, ఇస్నాపూర్ వరకు సుమారు 13 కిలోమీటర్ల వరకు విస్తరించాలని నిర్ణయించారు.
► అలాగే ఎల్‌బీనగర్ వరకు ఉన్న మెట్రోను హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట్ వరకు మరో 13 కిలోమీటర్లు పొడిగిస్తారు.
► శంషాబాద్ నుంచి కొత్తూరు. షాద్‌నగర్ వరకు మరో 25 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉప్పల్ వరకు ఉన్న మెట్రోను ఘట్కేసర్ , బీబీనగర్ వరకు పొడిగిస్తారు.శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ప్రస్తుతం నిర్మించ తలపెట్టిన మెట్రో కారిడార్‌ను మరో 26 కిలోమీటర్లు పొడిగించి తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూరు వరకు మెట్రో సదుపాయం కల్పిస్తారు.
► తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ 158 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి తూంకుంట, ప్యారైడెజ్ నుంచి కండ్లకోయ, కొంపల్లి, తదితర ప్రాంతాలకు కూడా మెట్రోను విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయి.
సుమారు రూ.60 వేల కోట్ల అంచనాలతో 400 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరణపై కేబినెట్ లో తాజాగా చేసిన ప్రతిపాదనలు హైదరాబాద్ మహానగర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment