నిజాంపేట్: టిఫిన్ బాక్స్‌ను బ్యాగులో పెట్టుకుని.. తల్లికి బై బై చెప్పి.. ఇంటి నుంచి నాన్న బండిపై స్కూల్‌కు బయలుదేరిన ఆ చిన్నారి 5 నిమిషాల్లోనే అనంత లోకాలకు చేరుకుంది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు చక్రాల కింద పడి 8 ఏళ్ల బాలిక దీక్షిత అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ గారాలపట్టి ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. కూతురు కోసం గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులను చూసి రోడ్డుపై వెళ్లేవారు, వాహనదారులను కన్నీరు పెట్టారు.
బాచుపల్లి ఎస్‌హెచ్‌ఓ సుమన్ కుమార్ కథనం ప్రకారం వివరాలు.. బాచుపల్లిలోని ప్రణీత్ అంటిల్యా సమీపంలోని ఇంద్రప్రస్థా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న కిశోర్, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కూతురు దీక్షిత (8) భౌరంపేట్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 3వ తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం 7.40 గంటలకు రెడ్డి ల్యాబ్స్ సమీపంలో కిశోర్ తన స్కూటీ వెనక భాగంలో కూతురు దీక్షతను కూర్చోబెట్టుకుని భౌరంపేట్‌లోని స్కూల్‌లో దింపేందుకు వెళుతున్నాడు.
ఇదే క్రమంలో బాచుపల్లి నుంచి ప్రగతినగర్ వైపు వెళుతున్న నిజాంపేట్ భాష్యం స్కూల్‌కు చెందిన బస్సు స్కూటీని ఢీకొట్టడంతో కిశోర్ ఎడమ, దీక్షిత కూడి వైపు రోడ్డుపై పడిపోయారు. వేగంగా వచ్చిన స్కూల్ బస్సు దీక్షితపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. కిశోర్ కుడి భుజానికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు 100కు కాల్ చేసి ప్రమాద సమాచారం ఇవ్వగానే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ కిశోర్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. దీక్షిత మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ రహీంను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంపై భిన్న వాదనలు..
ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో అనేక భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసుల విచారణ ప్రకారం.. ముందు చిన్న గుంత ఉండటంతో స్కూటీ మెల్లగా వెళుతోంది. వెనకనే వచ్చిన స్కూల్ బస్సు స్కూటీని ఢీకొనడంతో దీక్షిత కుడి వైపు రోడ్డుపై పడింది. దీంతో బస్సు వెనక చక్రల కింద పడి బాలిక మృతి చెందిందని పేర్కొంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం రోడ్డుపై ఉన్న గుంత మూలంగా స్కూటీ అదుపు తప్పి పాప కుడివైపు, తండ్రి కిశోర్ స్కూటీ ఎడమ వైపు పడ్డారని ఆరోపిస్తున్నారు. ఏదైమైనా ఈ ప్రమాదానికి రోడ్డుపై ఉన్న గుంతలు, అదే విధంగా డ్రైవర్ నిర్లక్ష్యం కూడా కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment