కార్యక్రమంలో మాట్లాడుతున్న పుల్లెల గోపీచంద్
సనత్‌నగర్: హైదరాబాద్ నగరం మెడికల్ టూరిజంగా అవతరించిందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు, ఇండియన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా అనేక దేశాల నుంచి వైద్యం కోసం నగరానికి వస్తుండడమే ఇందుకు నిదర్శనంగా చెప్పారు. యశోద హాస్పటల్స్–సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ‘లోయర్ లింబ్ జాయింట్ ప్రిజర్వేషన్’ అంశంపై రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ జాయింట్ రీప్లేస్‌మెంట్ కాన్ఫరెన్స్ అండ్ లైవ్ వర్క్‌షాప్ ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. ముఖ్యంగా క్రీడాకారులకు ఆర్థరైటిస్ వైద్యులు ఎంతో ప్రధానమన్నారు. ప్రాక్టీస్ చేసే సమయంలో పలుమార్లు కీళ్ళ నొప్పులకు గురవుతుంటారని, ఆ సమయంలో వైద్యులు ఇచ్చే ట్రీట్‌మెంట్, మానసిక స్థైర్యం ఎంతో గొప్పదన్నారు. మధుమేహం, కేన్సర్ వంటి అనేక వ్యాధుల కంటే ఆర్థరైటిస్ బారినపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. భారతీయ జనాభాలో దాదాపు 14 శాతం మంది ప్రతి సంవత్సరం ఆర్థరైటిస్‌తో వైద్యుని సహాయం కోరుకుంటున్నారన్నారు. రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్‌షాప్‌లో ’ఆర్ధోపెడిక్ వైద్య రంగంలో, జాయింట్ రీప్లేస్‌మెంట్‌లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విధానాలపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులు చర్చించారు. అలాగే రోబోటిక్ శిక్షణ, లైవ్ సర్జరీ, వీడియో ఆధారిత బోధనతో పరస్పరం విజ్ఞానాన్ని పంచుకున్నారు. రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీలు, ప్రత్యక్ష రోబోటిక్ శస్త్ర చికిత్సలను ప్రదర్శించారు. దేశం నలుమూలల నుంచి 500 మందికి పైగా ఆర్ధోపెడిక్ సర్జన్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో యశోద హాస్పటల్స్ సికింద్రాబాద్ సీనియర్ ఆర్ధోపెడిక్, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ నితిన్‌కుమార్ పాల్గొన్నారు.
బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
Comments
Please login to add a commentAdd a comment