9 నంబర్లు వస్తే.. లిఫ్ట్‌ చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

9 నంబర్లు వస్తే.. లిఫ్ట్‌ చేయొద్దు

Published Wed, Aug 16 2023 6:34 AM | Last Updated on Wed, Aug 16 2023 7:39 AM

- - Sakshi

హైదరాబాద్: 91తో కలిపి 9 అంకెల నంబర్‌తో మీకు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయా.. ఆ ఫోన్‌ కాల్స్‌ సమాధానం ఇస్తున్నారా.. అయితే మీ ఖాతాలు ఖాళీ. కేవలం మహిళలను కలవర పెట్టి, భయం సృష్టించి సైబర్‌ మోసగాళ్లు లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు. నగరంలో నమోదైన 30 ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం. నేర ప్రక్రియ ఇలా సాగుతోంది..

► సైబర్‌ మోసగాళ్లు తాజాగా voip (వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌) ద్వారా 91 తో కలిపి 9 అంకెల నంబర్లతో ఫోన్‌ చేస్తున్నారు. ఈ ఫోన్‌ ఎత్తగానే మేం ముంబై సీబీఐ ఆఫీస్‌ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్‌, మీ పేరు ఇదేనా అని అడుగుతారు. మీరు ముంబై నుంచి తైవాన్‌కు ఫెడ్‌ఎక్స్‌ కొరియర్‌ ద్వారా పార్శిల్‌ పంపిస్తున్నారని అందులో డ్రగ్స్‌ ఉన్నాయని, ఇంకా అనుమానాస్పద పత్రాలు ఇతర దేశాలకు పంపిస్తున్నారని, మీరు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారని కొరియర్‌ ప్రతినిధి చెప్పాడు. మీ మీద ముంబై సీబీఐ కేసు నమోదు చేసిందని.. ఈ సమాచారాన్ని మీ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చామని వారు 20 నిమిషాల్లో మిమ్మల్ని అరెస్టు చేసి మాకు అప్పగిస్తారని వివరిస్తాడు. ఈ మాటలకు భయపడి మా తప్పు లేదు మమ్మల్ని రక్షిచండి అని ప్రాధేయపడగానే లూటీ మొదలు పెడతారు. స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌తో అకౌంట్‌ ఖాళీ అవుతుంది.

► మీరు నిర్దోషి అని తెలియాలంటే మీ బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయాలి. మీకు మొత్తం ఎన్ని ఖాతాలు ఉన్నాయి చెప్పండి అని బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తారు. స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయిస్తారు. దీంతో మీ ఫోన్‌ మొత్తం వారి కంట్రోల్‌కి వెళ్లిపోతుంది. వెంటనే మీ ఖాతా నుంచి మా సీబీఐ ఖాతాకు కొంత డబ్బు పంపమని చెబుతారు. ఈ సమయంలో సైబర్‌ మోసగాళ్లు స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ ద్వారా మీ బ్యాంకు ఖాతా నంబర్‌, పాస్‌వర్డ్‌, యూజర్‌ నేమ్‌, పిన్‌ నంబర్లను తెలుసుకుంటారు. దాదాపు అలా 3 గంటల పాటు మాటల్లో పెట్టి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారు.

► ఇలా హైదరాబాద్‌ నగరంలో ఇలాంటి మోసానికి గురైన వారి సంఖ్య 30 వరకు చేరింది. ఇందులో 23 మంది మహిళలు బాధితులుగా పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కారు. అత్యధికంగా ఓ మహిళ రూ.40 లక్షలు పోగుట్టుకుంది. మొత్తం సైబర్‌ నేరగాళ్లు దాదాపు రూ.1.5 కోట్లు కాజేశారని నమోదైన ఫిర్యాదులతో వెల్లడైంది.

మోసాలకు చెక్‌ పెట్టాలంటే..
► మనకు వచ్చే ఫోన్‌ కాల్స్‌ 91 తో కలిపి 10 అంకెలు ఉంటాయని గ్రహించాలి. ‘ముంబై టూ తైవాన్‌ ఫెడ్‌ ఎక్స్‌ కొరియర్‌’ పేరు చెప్పగానే సైబర్‌ మోసానికి సంబంధించిన కాల్‌గా అనుమానించాలి.

► సీబీఐ పేరు చెప్పి పోలీసులు వస్తున్నారని మాట్లాడితే సరే పోలీసులు వచ్చిన తర్వాత మాట్లాడుతామని ఫోన్‌ కట్‌ చేయాలి.

► స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోమంటే అసలు చేయొద్దు.

► గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్లకు రెస్పాండ్‌ అవొద్దు.

► గుర్తు తెలియని వ్యక్తులు సుదీర్ఘంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది సైబర్‌ మోసగాళ్ల ఫోన్‌ కాల్‌గా భావించాలి.

► ఈ 9 అంకెల ఫోన్‌ కాల్స్‌ voip ద్వారా వస్తుందడంతో వీటి ఐపీ అడ్రస్‌లు విదేశాల్లో ఉంటున్నాయి. కొట్టేసిన నగదు కూడా వర్చువల్‌ కరెన్సీ రూపంలో విదేశాలకు పంపిస్తున్నారని పోలీసులు గుర్తించారు. నయా మోసం నుంచి అప్రమతంగా ఉండాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు.డార్క్‌ వెబ్‌ ద్వారా సైబర్‌ క్రిమినల్స్‌ పలు కొరియర్‌ సంస్థల నుంచి డేటా కొట్టేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement