హైదరాబాద్: వర్షాకాలంలో వానలు కురిసినట్లే ఎన్నికల సీజన్‌లో పార్టీల మార్పిడి అన్నది పరిపాటిగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు మూడు నెలల సమయం ఉండటంతో పొలిటికల్ సీజన్ మొదలైంది. నింగిలోని మేఘాలన్నీ వానలు కురవనట్లే పార్టీ అధిష్టానం ఇచ్చిన టికెట్ల హామీ నెరవేరక కొందరు, హామీ ఇవ్వకపోయినా ఆశతో ఎదురు చూసే కొందరు టికెట్ల తరుణాన పార్టీలు మారడం మామూలే. అన్ని పార్టీల్లోనూ సీట్ల పంపిణీ షురూ కాకపోవడంతో అదింకా ఊపందుకోలేదు. బీఆర్‌ఎస్ మాత్రమే అభ్యర్థుల జాబితా వెలువరించడంతో ప్రస్తుతం ఆ పార్టీ నుంచే అసంతృప్తి సెగలు కనిపిస్తున్నాయి.
అంబర్‌పేట నియోజకవర్గం టికెట్ వస్తుందని ఆశించిన సి.కృష్ణయాదవ్.. అది లభించకపోవడంతో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్‌ఎస్ ఆత్మగౌరవంలేని పార్టీ అని, బీసీలకు వ్యతిరేక పార్టీ అని, తనకు అంబర్‌పేట టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ ఇవ్వలేదని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం గాంధీజయంతి నాడు బాపూఘాట్ నుంచి స్వయంగా కారులో తీసుకెళ్లిన సీఎం తనకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చినప్పటికీ ఎప్పటి వరకు ఎలాంటి పదవి ఇవ్వలేదని పేర్కొన్నారు.
దీంతో ఆయన త్వరలోనే పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. బహుశా బీజేపీలోకి వెళ్లవచ్చనే అంచనాలున్నాయి. ఆ పార్టీ నుంచి ఆహ్వానం ఉన్నందునే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. బీజేపీ సైతం ఆయన కోరుకుంటున్న అంబర్‌పేట సీటు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. స్వయానా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పోటీ చేస్తారని భావిస్తున్న, గతంలో కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమది. ఈ నేపథ్యంలో ఆయనకు ఎక్కడి నుంచి సీటివ్వనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఊహాగానాలు ముమ్మరం..
కృష్ణయాదవ్ బాటలోనే మరికొందరు పార్టీని వీడతారనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే వాటికి సంబంధించి వారి నుంచి ఎలాంటి ప్రకటనలు వెలువడకపోవడంతో అవి కేవలం ఊహలకే పరిమితం కావచ్చుననే అభిప్రాయాలున్నాయి. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనకు మల్కాజిగిరి టికెట్‌తో పాటు తన కొడుకు రోహిత్‌కు మెదక్ టికెట్ కావాలనడం.. ఆయన కొడుక్కి రాని నేపథ్యంలో ఆయన చేసిన సవాళ్లను చూసిన వారు పార్టీ మారగలరనే భావించినప్పటికీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారం రోజుల్లో తన నిర్ణయం వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
టికెట్లు ఆశించి భంగపడిన వారిలో మహేశ్వరం నుంచి తీగల కృష్ణారెడ్డి, ఎల్‌బీనగర్ నుంచి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ సైతం పార్టీ మారవచ్చని కొందరు అంచనా వేసినప్పటికీ, వారినుంచి అలాంటి స్పందనేదీ లేదు. ఉప్పల్ సీటును ఆశించిన నగర మాజీ మేయర్ బొంతురామ్మోహన్ సైతం పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగినా దాన్ని ఖండించిన ఆయన.. ఎప్పటికీ బీఆర్‌ఎస్‌ను వీడనని పేర్కొన్నారు.
త్వరలో ఇతర పార్టీల్లో..
ప్రస్తుతానికి బీఆర్‌ఎస్ మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించినందున ఆ పార్టీ నేతల గురించే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా టికెట్ల పంపిణీ ప్రారంభించకపోవడంతో ఆ పార్టీల్లో అసమ్మతులు, అసంతృప్తులు కనిపించడం లేదు. కాంగ్రెస్‌లో ఒకే నియోజకవర్గానికి ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నందున.. టిక్కెట్లు రాని వారి అసమ్మతి టికెట్ల పంపిణీ తర్వాత వెల్లడి కానుంది. అలాగే బీజేపీలోనూ టికెట్ల పంపిణీ తర్వాతే అసంతృప్తులుంటే బయటికొస్తారని చెబుతున్నారు. టిక్కెట్ల పంపిణీ తర్వాత ఆయారామ్, గయారామ్‌ల సీజన్ మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment