హైదరాబాద్: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసులో సినీనటుడు నవదీప్ కూడా నిందితుడని, అతడు పరారీలో ఉన్నాడని నగర కొత్వాల్, తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) డైరెక్టర్ సీవీ ఆనంద్ గురువారం సాయంత్రం ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది సమయానికే తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి నవదీప్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. డ్రగ్స్ కేసులో ఉన్న నవదీప్ తాను కాదని, తన ఇంట్లోనే అందుబాటులో ఉన్నానని అందులో ప్రకటించాడు. ఆపై అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన శుక్రవారం తన న్యాయవాది ద్వారా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.
రామ్‌చంద్ వాంగ్మూలంతో వెలుగులోకి..
మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఫ్లాట్‌లో గత నెల 31న జరిగిన డ్రగ్ పార్టీ తీగ లాగిన టీఎస్ నాబ్ అధికారులు గురువారం మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్ విచారణలోనే నటుడు నవదీప్ పేరు వెలుగులోకి వచ్చింది. . నవదీప్‌కు స్నేహితుడు, సన్నిహితుడు అయిన రామ్‌చంద్ తన వాంగ్మూలంలో నవదీప్ సైతం తనతో కలిసి మాదకద్రవ్యాలు సేవించినట్లు వెల్లడించాడు. ఆఖరుసారిగా గత శనివారం ఇరువురం వీటిని తీసుకున్నట్లు బయటపెట్టాడు. దీంతో టీఎస్ నాబ్ అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.
మరికొందరితో కలిసి ఎస్కేప్...
హైదరాబాద్ సీపీ చెప్తున్న నవదీప్‌ను తాను కాదంటూ ట్వీట్ చేసిన నవదీప్ ఆపై కొన్ని మీడియా చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇవి ముగిసిన తర్వాత మరికొందరితో కలిసి కారులో బయటకు వెళ్లిపోయాడు. ఈ హడావుడి చూసిన టీఎస్ నాబ్ అధికారులు నవదీప్‌కు నోటీసులు జారీ చేయడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అతడు అందుబాటులో లేకపోవడంతో మరికొన్ని ప్రాంతాల్లోనూ గాలించారు. అర్ధరాత్రి వరకు పోలీసులతో టచ్‌లో ఉన్న నవదీప్ అదిగో వస్తున్నా.. ఇదిగో వస్తున్నా అంటూ మఽభ్యపెట్టాడు. ఆపై పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం తన న్యాయవాది ద్వారా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న టీఎస్ నాబ్ సైతం కౌంటర్ దాఖలు చేసింది.
గతంలోనూ గలాభాలు.. .
నవదీప్ వార్తల్లోకి ఎక్కడం ఇది తొలిసారేమీ కాదు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడపడంతో పాటు పోలీసుల విధులను అడ్డుకోవడానికి ప్రయత్నించి 2010లో అరెస్టయ్యాడు. అదే ఏడాది అక్టోబర్‌లో నాగార్జునసాగర్‌లో బోటుతో వెళ్లి కృష్ణా నదిలో చిక్కుకుని హడావుడి చేశాడు. 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరయ్యాడు.
నవదీప్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు
డ్రగ్స్ కేసులో నవదీప్‌ను మంగళవారం వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. గుడిమల్కాపూర్ పోలీసు స్టేషన్ పరిధి డ్రగ్స్ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్ వినియోగదారుడిగా ఉన్నాడని.. అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం లంచ్ మోషన్ రూపంలో నవదీప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కె.సురేందర్ వాదనలు చేపట్టారు. పిటిషనర్ తరఫున వెంకట సిద్ధార్థ వాదనలు వినిపించారు. ‘ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుగా నవదీప్‌ను కావాలని ఇరికించారని, ఆయనకు ఇతర నిందితులెవరితోనూ ప్రమేయం, అనుబంధం లేదని.. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ ఇవ్వాలి’ అని వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మంగళవారం వరకు నవదీప్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment