హైదరాబాద్: రౌడీషీటర్ హత్య కేసులో ఆరుగురు నిందితులను కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు కత్తులు, మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్, ఈస్ట్ జోన్ డీసీపీ సిహెచ్.రూపేశ్ చాంద్రాయణగుట్ట డీసీపీ మనోజ్ కుమార్, ఇన్‌స్పెక్టర్ జి.శేఖర్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ చిట్టీ బుర్రలతో కలిసి వివరాలను వెల్లడించారు. కంచన్‌బాగ్ పీఎస్ పరిధిలోని హఫీజ్‌బాబానగర్ సి–బ్లాక్ ప్రాంతానికి చెందిన సయ్యద్ నసీర్ (22) ఏసీ మెకానిక్‌గా పని చేసేవాడు. అతను 2020 సెప్టెంబర్‌లో ఇలియాస్, ఆరాఫత్‌తో కలిసి చాంద్రాయణగుట్ట పూల్‌బాగ్ ప్రాంతానికి చెందిన బాబా షిండే కుమారుడు విశాల్ షిండేను హత్య చేశాడు.
ఛత్రినాక పోలీసులు అప్పట్లో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం సయ్యద్ నసీర్‌తో పాటు అతని స్నేహితులు బాబా షిండే మరో కుమారుడు ఆకాశ్ షిండేను చంపుతామని గత రెండు నెలలుగా బెదిరిస్తున్నారు. దీంతో సయ్యద్ నసీర్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్న బాబాషిండే ఈ నెల 13న తెల్లవారుజామున తన కుమారుడు ఆకాశ్ షిండే, హషామాబాద్ ప్రాంతానికి చెందిన సయ్యద్ షా అబ్దుల్ జబ్బార్ ఆలియాస్ సులేమాన్, హఫీజ్ బాబానగర్‌కు చెందిన ప్రేమ్ మానే, కై ఫ్ మోహీనుద్దీన్, అత్తార్, షేక్ హషమ్ అలీతో కలిసి హఫీజ్‌బాబానగర్‌కు వెళ్లాడు. ఇంటి ముందు ఆటోలో కూర్చున్న సయ్యద్ నసీర్‌పై బాబా షిండే, ఆకాశ్ షిండే, సయ్యద్ షా అబ్దుల్ జబ్బార్ కత్తులతో దాడి చేస్తుండగా మిగతా వారు ఎవరూ రాకుండా కాపలా కాశారు.
సయ్యద్ నసీర్ కేకలు విని ఇంట్లో నుంచి బయటికి వచ్చిన అతడి తల్లి సయీదా బేగం చిన్న కుమారుడితో కలిసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో వారిని కూడా చంపుతామని బెదిరించి అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన నసీర్‌ను చికిత్స నిమిత్తం ఓవైసీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి సయీదా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కంచన్‌బాగ్ పోలీసులు సౌత్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి మూడు కత్తులు, మూడు బైక్‌లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు అత్తర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment