
జోష్ నింపిన ప్రసంగం..
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 45 రోజుల పాటు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించి ప్రతి డివిజన్‌లోని కాలనీల్లో అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించిన ప్రగతి నివేదన సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి కేటీఆర్ ఉపన్యాసం కేడర్‌లో జోష్ నింపింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల క్రితం ఎన్నో అనుమానాలు, అపనమ్మకంతో గులాబీ జెండా పంచన చేరామని.. ఆ సమయంలో కూకట్‌పల్లి ప్రాంత ఓటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారన్నారు. ఆ రోజు వ్యతిరేకంగా మాట్లాడిన వారే తెలంగాణ జెండాను మోస్తూ బీఆర్‌ఎస్ పార్టీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారన్నారు. ఈ రోజు ఈ ప్రాంతంలో నివాసం ఉండే సీమాంధ్ర ప్రజలే గులాబీ జెండాతో స్వాగతం పలికి కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కుల, మత, ప్రాంత బేధం లేకుండా అందరినీ కన్న బిడ్డల వలే కాపాడుతుండటంతో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో ఎంతో ఆదరణ లభిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కె.నవీన్ కుమార్, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్– 1
● తొమ్మిదేళ్లుగా శాంతిభద్రతలు భేష్
● విద్యుత్ సమస్యను నివారించాం
● తాగునీటి కటకటకు చెక్ పెట్టాం
● మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తాం
● కల్లబొల్లి మాటలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్‌ను నమ్మొద్దు
● రాష్ట్రానికి మొండిచేయి చూపిన ప్రధాని మోదీ: మంత్రి కేటీఆర్
● కూకట్‌పల్లి రంగధాముని చెరువు లేక్ ఫ్రంట్ పార్కు ప్రారంభం
సాక్షి, సిటీబ్యూరో/కూకట్‌పల్లి: హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కూకట్‌పల్లి రంగధాముని చెరువు లేక్‌ఫ్రంట్ పార్కును గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిదేళ్లలో నగరంలో శాంతి భద్రతలను కాపాడిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వేలాది కోట్ల రూపాయలతో తాగునీటి సమస్యను తీర్చామన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉంటే వార్త అయ్యేదని, ఈ రోజు కరెంటు పోతే వార్తలాగా మారిపోయిందనే విషయం ఎంతో సంతోషాన్నిస్తోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సినీనటుడు రజనీకాంత్ గతంలో నగరానికి వచ్చి ఇక్కడి అభివృద్ధిని చూసి న్యూయార్క్ సిటీలో ఉన్నామా అని ఆశ్చర్యం వ్యక్తం చేయటం తెలంగాణ ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. ఎస్సార్‌డీపీ నిధులు రూ.1000 కోట్లతో నాలాలను అభివృద్ధి చేశామన్నారు. త్వరలో రూ.5 వేల కోట్లతో నాలాలను ఆధునికీకరించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. నగరంలో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో రూ.9.5 కోట్లతో 3 ఎకరాల పార్కును సుందరవనంగా తీర్చిదిద్దేందుకు తక్షణం నిధులు కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. ఎన్నో అపోహలకు, భయభ్రాంతులకు గురిచేసిన వారే తెలంగాణ ప్రభుత్వానికి రెడ్‌కార్పెట్ పరుస్తున్నారని చెప్పారు. రూ.56 వేల కోట్లతో ఐటీ రంగం ఉన్న తెలంగాణ ఈ రోజు రూ.2 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రపంచ దేశాలకు తయారయ్యే వాక్సిన్‌లు మొత్తం హైదరాబాద్‌లోనే ఉండటం ఎంతో గర్వకారణమన్నారు. హైదరాబాద్‌ను భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఇవ్వని హామీలను కూడా అభివృద్ధి చేసి ప్రజలకు జవాబుదారీతనంగా స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు పాదయాత్ర చేయటం ఎంతో గొప్ప విశేషమన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రం గురించి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. మోదీ 2014లో హడావుడిగా వచ్చి.. పసిగుడ్డులా ఉన్న అమరావతికి గుండు సున్నా ఇచ్చారని, తెలంగాణకు మొండి చేయి చూపారంటూ సీమాంధ్ర ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. కేటీఆర్ ప్రసంగంపై కేపీహెచ్‌బీ కాలనీ ప్రజలు ఉత్సాహం కనబర్చారు. బీఆర్‌ఎస్ పార్టీకి అధిష్టానం ప్రజలేనని, కల్లబొల్లి మాటలు చెప్పేవారికి ఢిల్లీలో మోకరిల్లాలని కాంగ్రెస్, బీజేపీలను పరోక్షంగా ఆయన ఎద్దేవా చేశారు. 65 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ ఒక్క హామీనీ నెరవేర్చలేదని కొత్తగా ఆరు గ్యారంటీ పథకాలతో ఆ పార్టీ దొంగ నాటకాలు ఆడుతోందన్నారు. ఎన్నికల వేళ ఎవరూ మోసపోకూడదని కేటీఆర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment