హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తులు సిటీజనులను కంగారు పెట్టిస్తున్నాయి. ప్రజాపాలనలో అర్జీలు ఇచ్చేందుకు మిగిలింది మూడు రోజుల గడువే ఉండటంతో ఆందోళన కలిగిస్తోంది. ప్రజాపాలన కేంద్రాలతో పాటు మీ సేవ, ఆధార్ కేంద్రాలకు జనాలు క్యూ కడుతున్నారు. ఆరు గ్యారంటీల వర్తింపునకు రేషన్ కార్డుతోపాటు ఆధార్ కీలకం. గతంలో ఎప్పుడో తీసుకున్న ఆధార్ కార్డులు కావడం, ఆ తర్వాత వాటిని అప్‌డేట్ చేయకపోవడంతో మార్పులు, చేర్పులు అత్యవసరమయ్యాయి. మరోవైపు రేషన్ కార్డు కోసం బీపీఎల్ గుర్తింపునకు వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అయింది. ఫలితంగా మీ సేవ కేంద్రాలకు తాకిడి పెరిగింది. ప్రజాపాలన కేంద్రాల దరఖాస్తు స్వీకరణ కౌంటర్ల వద్ద కంటే ఆధార్, మీ సేవ కేంద్రాలకు జనం రద్దీ పెరిగింది.
అన్నింటికీ కీలకం..
ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ప్రతి నెలా రూ. 2500, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల వర్తింపునకు దరఖాస్తులో కచి్చతంగా ఆధార్ కార్డు నంబరు కీలకమైంది. నగరంలో అద్దె ఇళ్లలో ఉండే వారితో పాటు వలస వచ్చినవారు ఆధార్‌లో ప్రస్తుత (కొత్త) చిరునామాలు అప్‌డేట్ చేసుకోలేదు. ఇప్పటికీ చాలామంది ఆధార్ కార్డులపై పాత అడ్రస్‌లు ఉన్నాయి. కొత్త అడ్రస్‌ల మారి్పడి ఆరు గ్యారంటీల పథకాల వర్తింపు అడ్డంకి కాకపోయినా క్షేత్ర స్థాయి పరిశీలనలో కొంత సమస్య ఏర్పడే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా చేర్పులు మార్పులు చేసుకునేందుకు జనం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చి ఏళ్లు గడిచినా, అడ్రస్ మార్చుకోకపోవడం ద్వారా ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోంది. దీంతో ఆధార్‌లో అడ్రస్ మార్చుకొని ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆధార్ సెంటర్ల వద్ద కొత్త దంపతులే అధికంగా కనిపిస్తున్నారు.
ధ్రువీకరణ పత్రాలకు సైతం..
రేషన్ కార్డుకు ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కావడంతో మీ సేవ కేంద్రాలకు రద్దీ పెరిగింది. మరోవైపు ప్రభుత్వం అమలు చేయబోయే కొత్త పథకాలకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల అవసరం ఉంటుందనే భావనతో దరఖాస్తు చేసుకుంటున్నారు. మీ సేవ కేంద్రాలు తెరవక ముందే జనం బారులు తీరుతున్నారు. ఇప్పటికే మహానగర పరిధిలో ప్రజాపాలన కౌంటర్లకు సుమారు మూడు లక్షల వరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు
వచి్చనట్లు సమాచారం.
ఈ కేవైసీ కోసం..
ఆరు గ్యారంటీల్లోని గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఈ కేవైసీ అప్‌డేట్ తప్పనిసరి అని ప్రచారం కావడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం బారులు తీరుతున్నారు. రూ.500కే సిలిండర్ పథకానికి, ఈ కేవైసీకి సంబంధం లేదని అధికారులు చెబుతున్నా.. ఏజెన్సీల వద్ద క్యూ తగ్గడం లేదు. ఈ కేవైసీ చేయించుకోకపోతే పథకం లబ్ధి చేకూరదేమోననే ఆందోళనతో గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. గత పదిహేను రోజులుగా రద్దీ కొనసాగుతోంది. మరోవైపు కొందరు గ్యాస్ డెలివరీ బాయ్స్ ఈ కేవైసీ పూర్తి చేసి కొంత నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు పొడిగించారు. ఇప్పటికే మహానగర పరిధిలోని 78 శాతం లబి్ధదారులు బయోమెట్రిక్ ద్వారా కేవైసీని పునరుద్ధరించుకున్నారు.
అవే కావాలి!
సాక్షి, మేడ్చల్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన సభలకు దరఖాస్తుదారులు బారులు తీరుతున్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి కోసం గ్రేటర్ శివార్ల నుంచి విరివిగా అర్జీలు వస్తున్నాయి. నగరానికి సంబంధించిన దరఖాస్తుల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కోసం అందుతున్నాయి. అలాగే రేషన్ కార్డులు, రెవెన్యూ సమస్యలపై దరఖాస్తు చేసుకునే అవకాశం కలి్పంచకున్నా.. చాలా మంది ఆశావహులు తరలివస్తున్నారు. దీంతో ప్రజాపాలన సభల్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. చాలా మంది రేషన్ కార్డుల కోసం తెల్ల కాగితంతో పాటు జిరాక్స్ సెంటర్లలో లభించే దరఖాస్తు పత్రాలతో అర్జీలు పెట్టుకుంటున్నారు. నగర శివారు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో బుధవారం నాటికి మొత్తం 5,37,788 దరఖాస్తులు అందినట్లు అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment