సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో అందిన అన్ని దరఖాస్తులను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. తగిన జాగ్రత్తలతో డేటా ఎంట్రీ జరుగుతోందని, దరఖాస్తులను అత్యంత జాగ్రత్తలతో భద్రపరచినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగున్నర లక్షల దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయిందని, మిగతావి కూడా త్వరలోనే పూర్తిచేస్తామని పేర్కొన్నారు. స్పెషల్ ఆఫీసర్లు, టీమ్ లీడర్లు డేటా ఎంట్రీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, దరఖాస్తుల భద్రత కోసం వారికి కచ్చితమైన సూచనలిచ్చినట్లు పేర్కొన్నారు.
సాక్షి, సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్: జీహెచ్‌ఎంసీలో కొందరు అధికారుల ఇష్టారాజ్యంతో ప్రభుత్వానికి తలవంపు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల్లో భాగంగా అర్హమైన పథకాల కోసం గంటల తరబడి క్యూలో నిల్చొని ప్రజలందజేసిన అభయ హస్తం దరఖాస్తులు నడిరోడ్డుపై చెల్లాచెదురుగా పడిఉన్నాయి. దీనికి బాధ్యునిగా పేర్కొంటూ టీమ్‌లీడర్‌గా ఉన్న హయత్‌నగర్ సర్కిల్ ట్యాక్స్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం.మహేందర్‌ను సస్పెండ్ చేశారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోనూ అభయహస్తం దరఖాస్తు ఫారాలను బయటకు తరలిస్తుండగా గుర్తించారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను ఎక్కడికక్కడే సంబంధిత సర్కిల్/జోన్ పరిధిలోని కార్యాలయాల్లో కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండటం ఈ ఘటనతో వెలుగు చూసింది. సోమవారం సాయంత్రం బాలానగర్ ఫ్లై ఓవర్‌పై ఓ బైక్‌పై నుంచి కొన్ని కాగితాలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయాయి.
వాటిని చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు. అవి ప్రజాపాలనలోని దరఖాస్తులు కావడం.. అవి కూడా నగరానికి ఈ చివరన ఉన్న హయత్‌నగర్ సర్కిల్‌వి కావడంతో అవాక్కయ్యారు. ఈ దరఖాస్తులను ఆ చివరన ఉన్న కూకట్‌పల్లికి తరలిస్తున్నట్లు తెలిసింది. వాటిని కంప్యూటరీకరించేందుకు ప్రైవేట్ ఏజెన్సీకి తరలిస్తున్నట్లు తెలిసింది. హయత్‌నగర్ సర్కిల్ ఉన్నది ఎల్‌బీనగర్ జోన్‌లో కాగా.. వాటిని కూకట్‌పల్లికి ఎందుకు తరలించాల్సి వచ్చిందన్నది అంతుపట్టడం లేదు. అన్ని దరఖాస్తుల కంప్యూటరీకరణ ఒకే ఏజెన్సీకి ఇచ్చారా ? అన్నది అధికారులు వెల్లడించలేదు. కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్లు గతంలో తమ బదిలీ ఉత్తర్వులను పరస్పరం మార్చుకోవడాన్ని ప్రజలు ఈ సందర్భంగా చర్చించుకుంటున్నారు.
తప్పెవరిది.. శిక్ష ఎవరికి ?
సంబంధిత జోన్‌కు చెందిన ఉన్నతాధికారులు దరఖాస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉండగా, వారి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు విమర్శలు వెలువడుతున్నాయి. సంబంధిత జోన్, సర్కిల్ కమిషనర్‌పై కాకుండా సూపరింటెండ్‌పై మాత్రమే చర్యలు తీసుకోవడం వెనుక కారణాలేమిటో అంతుపట్టడం లేదు. ఎంతోకాలంగా సదరు ఏజెన్సీతో కొనసాగుతున్న సంబంధం వల్లే దూరంగా ఉన్నప్పటికీ ఆ ఏజెన్సీకి దరఖాస్తుల కంప్యూటరీకరణ పనులు కాంట్రాక్టుకిచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు ఇచ్చింది ఎవరు? అన్నది పట్టించుకోకుండా తూతూమంత్రంగా ఎవరో ఒకరిని బలి చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మారని జీహెచ్‌ఎంసీ తీరు..
గతంలోనూ ఎన్నికల సందర్భంగా తప్పులు జరిగినప్పుడు కింది స్థాయిలోని వారిని బలిపశువుల్ని చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. బాగా చేశారని పేరొస్తే మాత్రం ‘కిరీటాలు’ వాళ్లు పెట్టుకుంటూ, తప్పులు జరిగినప్పుడు మాత్రం చాకిరీ చేసిన ఉద్యోగులను బలి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
వికేంద్రీకరణ ప్రభావం..
జీహెచ్‌ఎంసీలో జోన్లకు సర్వాధికారాలు కట్టబెట్టినప్పటి నుంచే జోనల్ స్థాయిలో అవకతవకలు పెరిగిపోయాయనే ఆరోపణలున్నాయి. అరుదుగా ఎప్పుడో మాత్రమే ఇలాంటి ఘటనలు బయట పడుతున్నాయని చెబుతున్నారు. ఎక్కడైనా వికేంద్రీకరణ సత్ఫలితాలిస్తుండగా జీహెచ్‌ఎంసీలో అది పూర్తిగా రివర్స్ అయింది. పేదల జీవితాలతో ముడిపడి ఉన్న దరఖాస్తులను అద్దె బైక్‌పై పంపించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దరఖాస్తుల కంప్యూటరీకరణ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సి ఉండగా, ఎక్కడికిపడితే అక్కడికి, జీహెచ్‌ఎంసీ నుంచి కనీసం ఒక ఉద్యోగి కూడా వెంట లేకుండా పంపించడం, ఇళ్లకు కూడా పంపించడం, తదితరమైన వాటికి సమాధానాల్లేవు. కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోనూ దరఖాస్తులు బయటకు తరలిస్తుండటం వెలుగు చూడటంతో అక్కడ కూడా ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు వినిపిస్తున్నప్పటికీ, అధికారికంగా వెల్లడి కాలేదు.
మంత్రి పొన్నం ఆరా..
► దరఖాస్తుల తరలింపు ఘటనపై జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్‌ను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
► కూకట్‌పల్లి జోనల్ పరిధిలోని కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను ఇష్టానుసారంగా ప్రైవేటు సిబ్బంది చేతుల్లో పెట్టి ఇళ్లకు తీసుకువెళ్లి అప్‌లోడ్ చేయాల్సిందిగా సూచించడం విమర్శలకు తావిస్తోంది.
► మంగళవారం పలువురు దరఖాస్తులను ద్విచక్ర వాహనంపై పెట్టుకుని తీసుకువెళ్లడం కనిపించింది. ఈ దరఖాస్తులు ఎవరు ఇచ్చారు అనే ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అని అడిగితే ఇళ్లకు తీసుకువెళ్లి అప్లోడ్ చేయమన్నారు అనే సమాధానం చెప్పడం విశేషం. ఏఎంసీ భార్గవ్ నారాయణ సూచన మేరకు వార్డు కార్యాలయంలో అప్‌లోడ్ చేసేందుకు వెళుతున్నట్లు తెలిసింది. ఈ విషయంపై కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ నరసింహను ‘సాక్షి’వివరణ కోరగా వార్డు కార్యాలయంలో అప్‌లోడ్ చేసేందుకు తీసుకు వెళుతున్నారని, ఇంటికి తీసుకు వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment