సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు రెండో దశపై మరో అడుగు పడింది. దీనికి శనివారం రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఇక కేంద్రం నుంచి అనుమతి లభించడమే తరువాయి కానుంది. కేంద్రం కూడా ఈ ప్రాజెక్టును ఆమోదించి నిధులు కేటాయిస్తే పనులు ప్రారంభం కానున్నాయి. సుమారు రూ.24 వేల కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న రెండో దశ ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్రాల అనుమతితో పాటు సకాలంలో నిధులు లభిస్తే నిర్ణీత గడువులోగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో రైలు పరుగులు పెట్టనుందని అధికారులు తెలిపారు. ఫోర్త్ సిటీతో కలిపి మొత్తం ఆరు కారిడార్‌లలో 116.2 కిలోమీటర్ల మెట్రో రెండో దశకు ఇటీవల హైదరాబాద్ మెట్రో రైల్ డీపీఆర్‌ను రూపొందించి ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే.
భూగర్భంలో మెట్రో రైలు
నాగోలు నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 36 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న నాలుగో కారిడార్ ఎల్‌బీనగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్‌డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్, కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ జంక్షన్ నుంచి జాతీయ హైవే మార్గంలో సాగుతుంది. ప్రస్తుతం ఉన్న రాయదుర్గం నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్లు ఎయిర్‌పోర్టు మార్గంలో నాగోలు, ఎల్‌బీనగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్ల వద్ద అనుసంధానమవుతాయి.
మొత్తం 36.6 కిలోమీటర్ల ఎయిర్‌పోర్ట్ మెట్రో రూట్‌లో 35 కిలోమీటర్లు ఎలివేట్ చేయనున్నారు. 1.6 కిలోమీటర్‌ల వరకు మెట్రోలైన్ భూగర్భంలో నిర్మిస్తారు. ఎయిర్‌పోర్టుస్టేషన్ కూడా భూగర్భంలోనే ఉంటుంది. అలాగే రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు కొత్తగా నిర్మించనున్నారు. ఇది బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్‌గూడ జంన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ వరకు (బ్లూ లైన్ పొడిగింపుగా) ఉంటుంది. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ఈ 11.6 కిలోమీటర్ల మార్గంలో సుమారు 8 స్టేషన్లను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.
పాతబస్తీ మెట్రో చాంద్రాయణగుట్ట వరకు....
జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్‌లైన్ పొడిగింపుగా ఆరో కారిడార్‌ను విస్తరించనున్నారు. గతంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించిన ఈ మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇది ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్‌షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment