సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లు, స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కొద్దిరోజులుగా ఎండలు భగ్గుమంటున్నాయి. రోడ్లపై ప్రయాణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో నగరవాసులు సొంత వాహనాలను పక్కన పెట్టారు. ఆర్టీసీ బస్సుల్లోనూ పయనించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. కొద్ది రోజులుగా మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లో నిత్యం సుమారు 4.5 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా.. గురువారం మాత్రం సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించినట్లు అంచనా.
ఉదయం 8 గంటల నుంచే మెట్రో రైళ్లలో రద్దీ కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి నడుస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసేవారు వేసవి కారణంగా సొంత వాహనాల కంటే మెట్రో రైళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. రద్దీ గంటలుగా భావించే ఉదయం 8 నుంచి 10 వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. కానీ కొద్ది రోజులుగా అన్ని వేళల్లోనూ రద్దీ ఎక్కువగానే ఉంటుంది.
రెండు కారిడార్‌లలోనే ఎక్కువ..
నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు అక్కడి నుంచి రాయదుర్గం వరకు అన్ని ప్రధాన స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అలాగే ఎల్‌బీనగర్ నుంచి అమీర్‌పేట్ మీదుగా మియాపూర్ వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మాత్రం ప్రయాణికుల రాకపోకలు సాధారణంగానే ఉన్నాయి. మిగతా రెండు కారిడార్లలోనే రద్దీ ఎక్కువగా ఉంటోంది.
వివిధ స్టేషన్లలో కనీసం రెండు నుంచి మూడు మెట్రో రైళ్ల సామర్థ్యం మేరకు ప్రయాణికులు ఎదురు చూస్తుండగా ఒక్క రైలు మాత్రమే అందుబాటులోకి వస్తోంది. దీంతో మెట్రో ఆక్యుపెన్సీకి మించిన ప్రయాణికులతో రైళ్లు నడుస్తున్నాయి. నగరంలోని మూడు కారిడార్లలో ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 1000 ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు అందుబాటులో ఉంటున్నాయి. అయినా.. ప్రయాణికులకు పడిగాపులు తప్పడంలేదు.
ట్రిప్పులు పెరిగితేనే ఊరట...
ప్రస్తుతం ప్రతి 3 నుంచి 5 నిమిషాలకో రైలు చొప్పున నడుస్తున్నాయి. కానీ.. రద్దీ ఎక్కువగా ఉండే నాగోల్ –రాయదుర్గం రూట్‌లో 5 నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులు ఒక వెల్లువలా వచ్చేస్తున్నారు. ఎల్‌బీనగర్– మియాపూర్ రూట్‌లోనే అదే పరిస్థితి. రైళ్ల వేగాన్ని పెంచి ప్రతి 2 నిమిషాలకు ఒక మెట్రో అందుబాటులో ఉండేలా నడిపితేనే మరిన్ని ట్రిప్పులు పెరిగి ప్రయాణికులకు ఈ వేసవిలో ఊరట లభించే అవకాశం ఉంది. ఆ దిశగా హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాచరణ చేపడితే వేసవి తాపం నుంచి కొంత మేరకు ఉపశమనం లభించనుంది.
Here a the answer.
— Vishnu Vardhan (@vishnuremidi) April 20, 2023
When you will increase the coaches? #hyderabadmetro @KTRBRS @TelanganaCMO @NVSReddyIRAS pic.twitter.com/4GkAYW4iE4
Comments
Please login to add a commentAdd a comment