పంథా మార్చిన ‘డిజిటల్’ సైబర్ నేరగాళ్లు
నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగిని టార్గెట్ చేసి
రూ.20 లక్షలు వసూలు
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్స్, డ్రగ్స్, మనీలాండరింగ్ పేరుతో ఫోన్లు చేసి బెదిరించి డబ్బు దండుకునే సైబర్ నేరగాళ్లు తమ పంథా మార్చారు. బాధితులతో పాటు వారి సంతానాన్నీ డిజిటల్ అరెస్టుకు బదులుగా కిడ్నాప్ చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ–కేటుగాళ్ల బారినపడి రూ.20 లక్షలు పొగొట్టుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదుతో ఈ కొత్త పంథా వెలుగులోకి వచ్చింది.
ఒకే పార్శిల్‌లో రకరకాల వస్తువులంటూ...
నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి (61) ఇటీవల ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఎదుటి వ్యక్తులు తాము ఇంటర్నేషనల్ డీహెచ్‌ఎల్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు. మీ పార్శిల్ రిజెక్ట్ అయిందని, పూర్తి వివరాలు కావాలంటే ‘1’ నొక్కాలని సూచించారు. బాధితుడు అలా చేయడంతో లైన్‌లోకి వచ్చిన మరో వ్యక్తి మీ ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంకాక్‌కు ఓ పార్శిల్ బుక్ అయిందని చెప్పాడు. అందులో ఐదు పాస్‌పోర్టులు, మూడు ఏటీఎం కార్డులు, బ్యాంకు పత్రాలు, నాలుగు కేజీల వస్త్రాలతో పాటు 140 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ కూడా ఉన్నట్లు గుర్తించామని భయపెట్టాడు. ఆ పార్శిల్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ బాధితుడు చెప్పడంతో... అలాగైతే తాము ఫోన్‌ను ఢిల్లీ సైబర్ సెల్ అధికారులకు బదిలీ చేస్తామని వారితో మాట్లాడాలని సూచించారు.
కిడ్నాప్ చేస్తాం... చంపేస్తామంటూ...
సైబర్ సెల్ అధికారుల మాదిరిగా మాట్లాడిన సైబర్ నేరగాళ్లు మీ ఆధార్ దుర్వినియోగంపై ఫిర్యాదు చేయాలని ఓ పక్క ఉచిత సలహా ఇస్తూనే... అదే ఆధార్ వినియోగించి నాలుగు బ్యాంకు ఖాతాలు తెరిచారని, వాటి ద్వారా భారీ మనీలాండరింగ్ జరిగినట్లు వెలుగులోకి వచ్చిందని మరో కథ మొదలెట్టారు. ఆపై వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బాధితుడితో మాట్లాడిన సైబర్ నేరగాడు ఢిల్లీ పోలీసుగా నమ్మబలికాడు. మీపై నిఘా ఉందంటూ చెప్పి ప్రతి గంటకూ తమను సంప్రదించాలని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు జరిగిన స్కాముల్లో నేరగాళ్లు బాధితులను డిజిటల్ అరెస్టు చేసి ఈ విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాలని బెదిరించే వాళ్లు. ఈసారి మాత్రం రహస్యంగా ఉంచకపోతే మీతో పాటు కుటుంబీకులను కిడ్నాప్ చేయడం లేదా హత్య చేయడం జరుగుతుందని తీవ్రంగా భయపెట్టారు.
సీబీఐ, ఆర్బీఐ పేర్లతో నకిలీ లేఖలు..
అనంతరం సైబర్ నేరగాళ్లు బాధితుడికి సీబీఐ, ఆర్బీఐ పేర్లతో ఉన్న రెండు నకిలీ లేఖలను వాట్సాప్ ద్వారా పంపారు. వాటిలో బాధితుడికి మనీలాండరింగ్‌తో పాటు ఫోర్జరీ కేసులతో సంబంధం ఉన్నట్లు ఉంది. వీటి నుంచి విముక్తి పొందాలంటే తాము చెప్పినట్లు చేయాలని భయపట్టారు. బాధితుడు అంగీకరించడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతా వివరాలు పంపి అందులో కొంత నగదు బదిలీ చేయించుకున్నారు. మళ్లీ ఫోన్ చేసిన కేటుగాళ్లు మరికొంత మొత్తం డిమాండ్ చేయడంతో బాధితుడు తాను తన విధి నిర్వహణలో బిజీగా ఉన్నట్లు చెప్పాడు.
దీంతో విచక్షణ కోల్పోయిన నేరగాళ్లు తీవ్రస్థాయిలో బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారు. బాధితుడి కుమారుడికీ ముప్పు వాటిల్లుతుందని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. ఈసారి ఫెడరల్ బ్యాంక్‌ఖాతా వివరాలు ఇవ్వడంతో బాధితుడు తన ఫిక్స్‌డ్ డిపాజిట్లు సైతం బ్రేక్ చేసి నగదు చెల్లించాడు. ఇలా మొత్తం రూ.20 లక్షలు చెల్లించిన తర్వాత కూడా నేరగాళ్ల డిమాండ్లు ఆగలేదు. బయటికి వెళ్లిన అతడి కుమారుడు తిరిగి వచ్చి, ఈ విషయం తెలుసుకుని సైబర్ మోసంగా చెప్పాడు. దీంతో బాధితుడు సైబర్ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment