సిటీ కోర్టులు : మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త సూదిని సృజన్ రెడ్డి దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. తన పరువుకు భంగం కలిగేలా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సృజన్ రెడ్డి పరువునష్టం కేసు దాఖలు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. గురువారం ఆయన తరుఫు న్యాయవాదులు జి.కిరణ్‌కుమార్, జక్కుల లక్ష్మణ్ వకాలత్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాస్థానం ఇరువురి వాదనలు వినిపించేందుకు విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. షోధా కన్‌స్ట్రక్షన్ సంస్థలో తనకు ఎలాంటి షేర్లు లేవని, తాను ఆ సంస్థకు డైరెక్టర్‌ను కూడా కాదని, అయినా సదరు సంస్థతో తనకు సబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తూ కేటీఆర్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన బావ అయినందున షోధా కంపెనీకి రూ.2 కోట్ల లాభాన్ని ఇచ్చారని, ఎలాంటి అర్హతలేని కాంట్రాక్టులకు పొందారని కేటీఆర్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. భారతీయ హ్యూమ్ పైప్ కంపెనీ జాయింట్ వెంచర్ పేరుతో రూ.1,137.77 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారని కేటీఆర్ పలు పత్రికలు, టీవీ చానెళ్లలో ప్రచారం చేశారని అందుకు సంబందించిన క్లిప్పింగ్‌లను కూడా కోర్టుకు సమర్పించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడంతో సమాజంలో తన పరువుకు భంగం కలిగించినందున వెంటనే కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్‌లో కోరారు. సృజన్‌రెడ్డి తరుఫున న్యాయవాది వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కేటీఆర్ తరుఫు న్యాయవాదులు వకాలత్ దాఖలు చేయడంతో విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేస్తున్నట్లు జడ్జి శ్రీదేవి తెలిపారు.
కేటీఆర్ తరుఫున వకాలత్ దాఖలు చేసిన న్యాయవాదులు ఫిబ్రవరి 5కు విచారణ వాయిదా
Comments
Please login to add a commentAdd a comment