కోడల్ని చంపి.. అనుమానం రాకుండా నటించి..
శంషాబాద్ రూరల్: అత్త చేతిలో కోడలు దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, హతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం రామంజాపూర్ తండాకు చెందిన ముడావత్ సూర్య అలియాస్ సురేష్‌కు, అదే తండాకు చెందిన డోలి (40)తో ఇరవై ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. సురేష్ డీసీఎం వాహన డ్రైవర్‌గా పని చేస్తుండగా.. డోలి కూలీ పని చేస్తుండేది. సురేష్ తల్లిదండ్రులు తులసి, అనంతి కొన్నేళ్ల నుంచి సాతంరాయి వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తూ అక్కడే నివాసముంటున్నారు. సురేష్ చిన్నకొడుకు మనోహర్ వీరి వద్దనే ఉండేవాడు. సురేష్ దంపతులు, పెద్ద కొడుకుతో కలిసి రామంజాపూర్ తండాలో నివసిస్తున్నారు. సురేష్ తరచూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో గత నవంబర్ 10న డోలి అదృశ్యమైంది. అదే నెల 14న శంషాబాద్ పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు.
అత్త వద్దకు వెళ్లి..
భర్తతో గొడవ పడిన డోలి సాతంరాయిలో ఉన్న అత్తామామల వద్దకు వెళ్లింది. అదే రోజు రాత్రి వ్యవసాయ క్షేత్రానికి ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి బెంగళూరు జాతీయ రహదారి దాటి ఇద్దరు వెళ్లారు. అక్కడ ఇద్దరు కలిసి కల్లు తాగారు. మత్తులో ఉన్న దోలిని హత్య చేసిన తులసి అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లింది. తర్వాత కోడలి కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెతికినట్లు నటించి తనపై అనుమానం రాకుండా చూసుకుంది. నిర్మానుష్య ప్రదేశంలోని డోలి మృతదేహం ఉన్న ప్రాంతంలో కొంత కాలంగా వెంచర్ నిర్వాహకులు భారీగా మట్టిని పోగు చేస్తున్నారు. లారీల్లో వేరే చోట నుంచి తెచ్చిన మట్టిని పోస్తున్నారు. ఈ మట్టి కుప్పల కింద మృతదేహం కూరుకుపోవడంతో ఎవరికీ కనిపించలేదు.
మృతురాలి కుమారుడికి సందేహం రావడంతో..
రెండు రోజుల క్రితం మృతురాలి పెద్ద కుమారుడు తండా నుంచి సాతంరాయిలోని నానమ్మ తులసి వద్దకు వచ్చాడు. కోడలిని హత్య చేసిన భయంతో ఉన్న తులసి.. మనవడితో మాట్లాడిన తీరు అనుమానాలను రేకెత్తించింది. దీంతో అతను తండాకు వచ్చి తన మేనమామ హరికి విషయం చెప్పాడు. కుటుంబ సభ్యులు సాతంరాయిలో తులసి వద్దకు వెళ్లి మృతురాలి చిన్న కొడుకు మనోహర్‌తో మాట్లాడారు. తన తల్లి ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి చెప్పవద్దని.. లేదంటే చంపేస్తానని నాన్నమ్మ బెదిరించినట్లు చెప్పడంతో.. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తులసిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో హత్య విషయం వెలుగు చూసింది. దీంతో గురువారం పోలీసులు రాజేంద్రనగర్ ఎమ్మార్వో రాములు పర్యవేక్షణలో ఘటనా స్థలంలో మట్టి దిబ్బల కింద మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. డోలి హత్యకు తులసి భర్త అనంతితో పాటు ఇతని సోదరుడు హనుమ సహకరించినట్లు తెలిసింది. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment