
స్పష్టం చేసిన జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టుల విభాగం
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం)లో భాగంగా నల్లగొండ క్రాస్‌రోడ్స్– ఒవైసీ జంక్షన్ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనుల్ని జూన్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ‘జాప్యం ఖరీదు రూ.100 కోట్లు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో వెలువడిన కథనానికి జీహెచ్‌ఎంసీ స్పందించింది. జూన్ 30 నాటికి పనులు పూర్తి చేస్తామని వివరణనిచ్చింది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల గురించి తెలిపింది. ఫ్లై ఓవర్ పొడవు 3.38 కిలోమీటర్లు కాగా, క్షేత్రస్థాయిలో పనులకు ఆటంకాలు లేని ప్రాంతాల్లో ఇప్పటి వరకు 50 శాతం పనులు పూర్తయినట్లు సంబంధిత ప్రాజెక్ట్ విభాగం పేర్కొంది.
మొత్తం 88 ఫౌండేషన్లకుగాను 86 ఫౌండేషన్ల పనులు పూర్తయ్యాయని, ప్రార్థనాస్థలానికి చెందిన భూసేకరణ పూర్తికాకపోవడంతో మిగతా రెండు ఫౌండేషన్ల పనులు జరగలేదని తెలిపింది. 88 పియర్స్‌కుగాను 88 పియర్స్ పనులు పూర్తయ్యాయని, అలాగే 43 పియర్‌క్యాప్స్ పనులు జరిగినట్లు తెలిపింది. మిగతావాటి ఫ్యాబ్రికేషన్ పనులు జరుగుతున్నాయని తెలపడంతోపాటు సైదాబాద్ జంక్షన్– యాదగిరి థియేటర్ మధ్య 23 ఆస్తులకు సంబంధించిన భూసేకరణ జరగనందున పనుల్లో ఆలస్యమవుతోందని వెల్లడించింది. భూసేకరణ పూర్తి కాకపోవడంతోనే స్పాన్స్ అమరిక పనులు కూడా పూర్తి కాలేదని తెలిపింది.
ఈ పనులకు 149 ఆస్తుల సేకరణ జరగాల్సి ఉండగా, 126 ఆస్తుల సేకరణ జరిగిందని, మిగతా 23 ఆస్తుల సేకరణ ప్రక్రియ జరుగుతోందని వివరించింది. వాటిల్లో ఐదు మతపరమైన ఆస్తులున్నట్లు పేర్కొంది. వాటి సేకరణ కోసం టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలు సమన్వయంతో సంబంధీకులతో సంప్రదింపులు జరుపుతూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు.. అయిదు ఆస్తులకు సంబంధించి కోర్టు కేసులున్నట్లు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల్ని ఏకరువు పెట్టింది. ట్రాఫిక్ రద్దీ వల్ల డెక్‌స్లాబ్ పనులు పగలు చేయడం సాధ్యం కాదని, రాత్రుళ్లు మాత్రమే చేస్తున్నందున పనులు నెమ్మదిగా జరుగుతున్నట్లు తెలిపింది. ఏదేమైనప్పటికీ, అన్ని అవరోధాల్ని, ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించుకుంటూ జూన్ నెలాఖరు వరకు పూర్తి చేయగలమని వివరణనిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment