సాక్షి, రంగారెడ్డి జిల్లా: పేద, మధ్య తరగతి మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఆలోచనలో భాగంగా ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. తద్వార విలువైన దేవుడి మాన్యాలు కబ్జాకాకుండా కాపాడటంతో పాటు మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వొచ్చని భావిస్తోంది. ఇందుకోసం రెవెన్యూ అధికారులు ప్రాణాళిక రూపొందించారు. ఏ దేవుడి పేరున? ఏ గ్రామంలో? ఎంత భూమి ఉందో? గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించనున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు బ్యాంకర్లతో చర్చలు కూడా జరిపారు. సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, డిస్కం గ్రిడ్‌లకు అనుసంధానం చేయనున్నారు. వచ్చే డబ్బులతో బ్యాంకు రుణాలను తీర్చడంతో పాటు మహిళల ఆర్థిక పురోగతికి బాటలు వేయనున్నారు.
24 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తి
జిల్లాలో 21 మండల మహిళా సమాఖ్యలు, 788 గ్రామ మహిళా సంఘాలు, 19,209 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 2,06,116 మంది సభ్యులు ఉన్నారు. వివిధ బ్యాంకులు వీరికి ఏటా రూ.వెయ్యి కోట్ల వరకు రుణాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్ కోసం పూర్తిగా థర్మల్, హైడల్ పవర్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. డిమాండ్ మేరకు వనరులు లేకపోవడంతో సరఫరాలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అదే ఒక్కసారి సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే.. 24 ఏళ్లు పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే కనీసం నాలుగెకరాల భూమి అవసరమవుతోంది. అదే ఖాళీ గా ఉన్న ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూముల్లో వీటిని ఏర్పా టు చేయడం ద్వారా స్థానిక అవసరాలు తీర్చడంతో పాటు మిగిలిన విద్యుత్‌ను డిస్కంలకు అమ్ముకుని సొమ్ము చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
జిల్లాలోని దేవుడి భూములివే..
● మాడ్గుల మండలం అర్కపల్లిలోనిశ్రీఆంజనేయస్వామి దేవాలయం పేరున 34 ఎకరాలు.
● ఇంజాపూర్‌లోని శ్రీబాలాజీ
వేంకటేశ్వరస్వామి దేవాలయం పేరున 74.15 ఎకరాలు.
● యాచారం మండలంలోని
ఓంకారేశ్వరాలయానికి 1,450 ఎకరాలు.
● పెండ్యాల లక్ష్మీనరసింహ్మస్వామి
దేవాలయానికి 360 ఎకరాలు.
● అమ్మపల్లిలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి 222 ఎకరాలు.
● మామిడిపల్లి బాలాజీ వేంకటేశ్వ రస్వామి దేవాలయానికి 33.12 ఎకరాలు.
● జెన్నాయిగూడలోని క్షేత్రగిరి
లక్ష్మీనరసింహ్మస్వామి
దేవాలయానికి 800 ఎకరాలు.
● కడ్తాల్‌లోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి
ఆలయానికి 41.29 ఎకరాలు ఉన్నట్లు సమాచారం.
● ఈ స్థలాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
దేవుడి మాన్యాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు
మహిళా సమాఖ్యల ఆర్థిక అభ్యున్నతి దిశగా అడుగులు
ఆలయ భూములను గుర్తించే పనిలో రెవెన్యూ యంత్రాంగం
మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు నాలుగెకరాల భూమి అవసరం
Comments
Please login to add a commentAdd a comment