పాత నేరస్తుడి పనే..
బంజారాహిల్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని ఇందిరానగర్‌లో జరిగిన భారీ చోరీ కేసు బంజారాహిల్స్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇందిరానగర్‌కు చెందిన లోవకుమారి, వీరవెంకటరమణ దంపతులు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 12న ఇంటికి తాళం వేసి రాజమండ్రికి వెళ్లారు. ఇంటి భద్రతను ఇంట్లో కిరాయికి ఉండే తిరుమలరెడ్డికి అప్పగించారు. అయితే సినిమా షూటింగ్‌లలో హెల్పర్‌గా పనిచేసే తిరుమలరెడ్డికి నాలుగు రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో బోరబండ కార్మికనగర్‌కు చెందిన దాసరి రక్షక్‌రాజ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మూడు రోజులుగా ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 13న రాత్రి తిరుమలరెడ్డి ఆహ్వానం మేరకు రక్షక్‌రాజ్ అతడి ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. పీకలదాకా మద్యం తాగిన తిరుమలరెడ్డి నిద్రపోయాడు. అదే అదునుగా అంతకముందే సదరు ఇంటి యజమానుల వివరాలు ఆరా తీసిన రక్షక్‌రాజ్ వారు లేరని తెలుసుకున్నాడు. బండరాయితో ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న రూ.25 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలతో తన స్కూటీపై ఉడాయించాడు. రంగంలోకి దిగిన బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా బైక్‌పై ఇద్దరు వచ్చిన దృశ్యాలు, వెళ్లేటప్పుడు ఒక్కడే వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. తిరుమలరెడ్డితో వచ్చిన వ్యక్తి ఎవరని ఆరా తీయగా తనకు మూడు రోజుల క్రితమే పరిచయం ఏర్పడిందని చెప్పాడు. దీంతో పోలీసులు రక్షక్‌రాజ్ ఫోన్ నెంబర్ ఆధారంగా గురువారం ఉదయం అతడిని కార్మికనగర్‌లోని అతడి ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. బీరువాలో దాచిన నోట్ల కట్టలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 2020లో జూబ్లీహిల్స్‌లో ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. ఎనిమిది నెలల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే చోరీకి యత్నించి పోలీసులకు చిక్కినట్లుగా విచారణలో వెల్లడైంది. కిరాయిదారు తిరుమలరెడ్డికి రక్షక్‌రాజ్ ఫేస్‌బుక్‌లో పరిచయమైనట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. చోరీ సొత్తు పూర్తిగా పట్టుబడడంతో అటు బాధితులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
● భారీ చోరీ కేసులో నిందితుడి అరెస్టు
● 24 గంటల్లోనే కేసును ఛేదించి సొత్తు రికవరీ చేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment