కలర్‌.. కమాల్‌! | - | Sakshi
Sakshi News home page

కలర్‌.. కమాల్‌!

Published Fri, Jan 17 2025 10:36 AM | Last Updated on Fri, Jan 17 2025 10:36 AM

కలర్‌.. కమాల్‌!

కలర్‌.. కమాల్‌!

వాహన అద్దాల ‘రంగు’ ముదురుతోంది!!

సాక్షి, సిటీబ్యూరో: ‘కార్లు ఇతర వాహనాల అద్దాలపై రంగు ఫిల్మ్‌లు తదితరాలు ఉండకూడదు. ఆయా వాహనాల్లోని లోపలి భాగం స్పష్టంగా బయటికి కనిపించేలా ఉండాలి’ అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గతంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలివి. వీటి అమలు నగరంలో క్రమక్రమంగా మసకబారుతోంది. అనేక వాహనాల అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ వేసుకుని సంచరిస్తున్నా పోలీసుల చర్యలు మాత్రం నామమాత్రంగా మారాయి.

70.. 50 శాతం కాంతి ప్రసారం కచ్చితం..

వాహనాల్లో జరుగుతున్న నేరాలు, ప్రమాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం 2012లో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమలు చేయాల్సిన బాధ్యతను రాష్ట్రాల డీజీపీలు, కమిషనరేట్ల కమిషనర్ల ద్వారా ఆయా ట్రాఫిక్‌ విభాగాలకు అప్పగించింది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వాహనాల ముందు వెనుక అద్దాలు 70 శాతం, పక్క తలుపులకు ఉన్న అద్దాలు 50 శాతం కాంతి ప్రసారకాలుగా (విజువల్‌ లైట్‌ ట్రాన్స్‌మిషన్‌) ఉండాల్సిందే. ప్రస్తుతం అనేక వాహనాలకు ఇది కేవలం 30, 10 శాతంగానే ఉంటోంది. ఫిల్మ్‌లతో పాటు ఇతర ఏ విధమైనవీ అద్దాలపై నిర్ణీత ప్రమాణాలకు మించి ఉండకూడదు. కార్లను తయారు చేసే కంపెనీలు కచ్చితమైన ప్రమాణాలతో అద్దాలను రూపొందిస్తాయి. వీటినే కొనసాగిస్తే ఉత్తమమని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే.. అనేక మంది ఆ అద్దాలపై ఫిల్మ్‌లు వేసుకుంటున్నట్లు వివరిస్తున్నారు.

ఆ రెండు కేటగిరీలకే మినహాయింపు..

బ్లాక్‌ ఫిల్మ్‌తో కూడిన అద్దాల వాహనాలు వినియోగిస్తున్న వారిలో సామాన్యులే కాదు.. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు సైతం ఉంటున్నారు. సెలబ్రెటీలు కూడా తమకు పబ్లిక్‌ ప్లేసుల్లో అభిమానులతో అనవసర ఇబ్బందులు వస్తాయనే సాకుతో వినియోగిస్తున్నారు. ప్రజాప్రతినిధులైతే ఏకంగా భద్రతా కారణాలు చెబుతున్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం బ్లాక్‌ ఫిల్మ్‌ నిబంధన నుంచి కేవలం జెడ్‌, జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉండే అత్యంత ప్రముఖులకు మాత్రమే మినహాయింపు ఉంది. అదీ కేవలం అధీకృత వాహనాలు, భద్రతాపరమైన అంశాల్లో మాత్రమే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యున్నత అధికారుల వాహనాలకు సైతం ఫిల్మ్‌ లేని అద్దాలతో కూడిన వాహనాలనే వినియోగించాల్సి ఉంది.

మినహాయింపు పొందటం ప్రహసనమే...

ఓ ప్రముఖుడు లేదా వ్యక్తికి భద్రత కల్పించాలన్నా, గన్‌మెన్‌లను ఏర్పాటు చేయాలన్నా దానికి సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్సార్సీ) సిఫార్సులు తప్పనిసరి. అలాగే ఈ బ్లాక్‌ ఫిల్మ్‌ నిబంధన నుంచి జెడ్‌, జెడ్‌ ప్లస్‌ కేటగిరీల్లో ఉన్న వారు కాకుండా ఇతరులు మినహాయింపు పొందాలంటే దానికి పెద్ద ప్రహసనమే ఉంది. రాష్ట్ర స్థాయిలో హోమ్‌ సెక్రటరీ నేతృత్వంలో డీజీపీ తదితరులతో ఏర్పాటయ్యే అత్యున్నత స్థాయి ప్రత్యేక కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ కమిటీ దరఖాస్తుతో పాటు దరఖాస్తుదారుడి పూర్వాపరాలను పరిశీలించి, వివిధ కోణాల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కమిటీ కేవలం భద్రతాపరమైన అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మినహాయింపులు ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘సుప్రీం’ తీర్పులో ప్రస్తావన లేనందున వాహనాల వెనుక, పక్క అద్దాలకు లోప లి వైపు నుంచి కర్టెన్లు వేసుకుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదని అధికారులు చెబుతున్నారు.

లోపలి భాగం స్పష్టంగా కనిపించకుండా ఏర్పాటు

సుప్రీం కోర్టు ఆదేశాలూ బేఖాతర్‌

సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులదీ ఇదే పంథా

నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్న పోలీసులు

అప్పట్లో పక్కాగా అమలు..

ప్రస్తుతం నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌ గతంలో సిటీ ట్రాఫిక్‌ విభాగం చీఫ్‌గా వ్యవహరించారు. అప్పట్లోనే సుప్రీం కోర్టు తీర్పు కూడా రావడంతో పక్కాగా అమలు చేశారు. ఉల్లంఘనులకు జరిమానాలు విధించడానికి ముందు కొన్ని రోజుల పాటు ప్రచారం చేశారు. ఆపై ప్రత్యేక డ్రైవ్స్‌ ప్రారంభించారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 100 కింద తొలుత రూ.500 చొప్పున, ఆపై రూ.వెయ్యి చొప్పున జరిమానాలు విధించారు. సుప్రీం కోర్టు ఆదేశాలు దేశ వ్యాప్తంగా అందరికీ శిరోధార్యం కావడంతో జిల్లాల నుంచి నగరానికి వచ్చే వాహనాలకూ వర్తింపజేశారు.

కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫిల్మ్‌లు కలిగి ఉన్న వాహనాలను ఆపి, రోడ్లపైనే తొలగించారు. వాహనాల అద్దాలపై ఉన్న ఫిల్మ్‌ పరిమాణాన్ని కొలవడానికి టిల్టో మీటర్ల కూడా వినియోగించారు. ఫిల్మ్‌ వినియోగం వద్దని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలంటూ సాధారణ పరిపాలన శాఖ, పోలీసు వాహనాలకు సంబంధించి పోలీసు రవాణా విభాగం, కమిషనరేట్లలోని సంబంధిత విభాగాలు, హైకోర్టు రిజిస్ట్రార్‌లతో పాటు అన్ని విభాగాల అధిపతులకు (హెచ్‌ఓడీ) లేఖలు సైతం రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement