రా‘బంధు’లెవరో?
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంజూరు చేసిన బీసీ, మైనారిటీ బంధు యూనిట్లపై అధికార యంత్రాంగం ఆరా తీస్తోంది. వంద శాతం సబ్సిడీతో రూ. లక్షల విలువైన యూనిట్లను మంజూరు చేసింది. అప్పట్లో లబ్ధిదారుల ఎంపిక నుంచి చెక్కుల పంపిణీ వరకు వ్యవహారమంతా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే సాగింది. తాజాగా సంక్షేమ శాఖల నుంచి లబ్ధిదారులు ఫోన్ల తాకిడి పెరిగింది. ‘యూనిట్ల పరిశీలనకు వస్తున్నాం.. షాపు చిరునామా చెప్పండి’ అంటూ ఫోన్లు వస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవంగా బీసీ, మైనారిటీ బంధు కింద రూ.లక్ష లబ్ధి పొందిన వారిలో సగానికిపైగా యూనిట్లను నెలకొల్పనట్లు తెలుస్తోంది. రుణ మంజూరుకు సిఫారసులు చేసిన వారికి కొంత ముట్టజెప్పి మిగితాది తమ అవసరాలకు ఖర్చు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా యూనిట్లపై విచారణ ప్రారంభం కావడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు.
గ్రేటర్‌లో 7,200 యూనిట్లు..
గ్రేటర్ పరిధిలో సుమారు 7,200 యూనిట్లు మంజూరైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ హయాంలో బీసీ బంధు కింద మొదటి విడతగా నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వృత్తి, చిరు వ్యాపారాల కోసం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించారు. వాస్తవంగా గ్రేటర్ పరిధిలో సుమారు 65 వేల మందికి పైగా చేతి, కులవృత్తిదారులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 20,724, మేడ్చల్‌లో 22 వేల 87 మంది, రంగారెడ్డి జిల్లాలో సుమారు 20 వేలకుపైగా దరఖాస్తులు అందినట్లు బీసీ సంక్షేమ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి విడత పంపిణీ తర్వాత రెండో విడతలో మిగిలిన అర్హులైన వారికి అందిస్తామని ప్రకటించినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో వాటి ప్రస్తావనే లేకుండా పోయింది.
ఎన్నికల సమయంలో..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వంద శాతం సబ్సిడీతో బీసీ, మైనారిటీ బంధు పథకాలను అమలు చేసింది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రతీ యేటా సబ్సిడీతో కూడిన బ్యాంక్ లింకేజీ ఆర్థిక చేయూత కోసం దరఖాస్తులను స్వీకరిస్తూ వచ్చింది. అందులో కేవలం 80 శాతం సబ్సిడీతో కూడిన బ్యాంక్ లింకేజీ కింద రూ.లక్ష రుణం మాత్రమే మంజూరు చేసి మిగతా సబ్సిడీ రుణాలను పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. అయితే.. రూ. లక్ష రుణం కోసం కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులను రావడంతో అర్హులను గుర్తించి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను గుర్తించినా నిధుల విడుదల కాకపోవడంతో ఆర్థిక సాయం మంజూరు పెండింగ్‌లో పడిపోతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం బీసీ, మైనారిటీ బంధు పథకం ప్రకటించి వంద శాతం సబ్సిడీని వర్తింపజేసింది. అయితే.. రుణ సహాయం పొందిన వారిలో సగానికి పైగా యూనిట్లు ఏర్పాటు చేయకపోవడంతో అసలు తలనొప్పి ప్రారంభమైంది.
అసెంబ్లీ ఎన్నికల ముందు రుణ వితరణలు
బీసీలు, మైనారిటీలకు రూ.లక్ష చొప్పున అప్పు
ప్రస్తుతం యూనిట్లపై ఆరా తీస్తున్న అధికారులు
అయోమయానికి గురవుతున్న లబ్ధిదారులు
మనుగడలో లేని సగానికి పైగా యూనిట్లు
Comments
Please login to add a commentAdd a comment