సాక్షి, సిటీబ్యూరో: భూముల అమ్మకాల ద్వారా గతంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించిన హెచ్‌ఎండీఏ మరోసారి అదే తరహాలో భూ వేలానికి రంగం సిద్ధం చేసింది. అబ్దుల్లాపూర్‌మెట్, తిమ్మాయిగూడ ప్రాంతంలో సుమారు 156.02 ఎకరాల భూమి సేకరణకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో రైతుల నుంచి భూములను సేకరించి భారీ లేఅవుట్‌లను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా అబ్దుల్లాపూర్‌మెట్‌లోనూ భారీ లేఅవుట్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. రైతుల నుంచి సేకరించనున్న భూములపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా 30 రోజుల్లో తెలియజేయాలని తాజా నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. గతంలో హెచ్‌ఎండీఏ భూములతో పాటు, రైతుల నుంచి సేకరించిన భూముల్లోనూ లే అవుట్‌లను వేసి ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించారు. బుద్వేల్, కోకాపేట్, మోకిలా, బాచుపల్లి, ఉప్పల్ భగాయత్, బోడుప్పల్, తొర్రూర్, హయత్‌నగర్, తదితర ప్రాంతాల్లో ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు కొనుగోలుదార్ల నుంచి అనూహ్య స్పందన లభించిది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు భూసేకరణ ముందుకు సాగలేదు. పైగా ఆన్‌లైన్ బిడ్డింగ్‌పైన కూడా అధికారులు వెనుకంజ వేశారు. రియల్‌ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్తబ్దత దృష్ట్యా భూముల వేలం ప్రతిపాదనను విరమించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో సేకరణకు చర్యలు చేపట్టడం గమనార్హం. రైతుల నుంచి సేకరించనున్న భూముల్లో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తదితర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి రైతులకు 60 శాతం భూములను తిరిగి ఇవ్వనున్నారు.మిగతా 40 శాతం భూములను హెచ్‌ఎండీఏ విక్రయించనుంది. అబ్దుల్లాపూర్‌మెట్ అనంతరం దశలవారీగా మిగతా ప్రాంతాల్లోనూ భూముల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
అబ్దుల్లాపూర్‌మెట్‌లో 156.02 ఎకరాలకు నోటిఫికేషన్
భారీ లేఅవుట్‌కు సన్నాహాలు
గతంలో ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment