కొత్త రేషన్ కార్డులు కొందరికే!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి పంపిణీ చేయనున్న కొత్త రేషన్ కార్డులు కొందరికే అందనున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే కోసం ఇటీవల నిర్వహించిన ఇంటింటి (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వే వివరాల ఆధారంగా రేషన్ కార్డుల్లేని కుటుంబాలు గ్రేటర్ పరిధిలో 83,285 మాత్రమే ఉన్నట్లు అధికారులు లెక్కలు తీశారు. ఆ లెక్క మేరకే క్షేత్రస్థాయి సర్వే జరుపుతున్నారు. క్షేత్రస్థాయిలోనూ అర్హులుగా గుర్తించిన వారికే కొత్త రేషన్ కార్డులివ్వనున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించేది 83 వేల దరఖాస్తులే..
పాతబస్తీలో ఎక్కువ
ఇంటింటి సర్వే మేరకు పాతబస్తీలోనే రేషన్‌కార్డుల్లేని కుటుంబాలు అధికంగా ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో చార్మినార్ జోన్‌లో, 30 సర్కిళ్లలో కార్వాన్ సర్కిల్‌లో అత్యధికంగా ఉన్నాయి.
సమగ్ర కుటుంబ సర్వే వివరాలతోనే..
‘ప్రజాపాలన’లో అర్జీ పెట్టుకున్న 5.43 లక్షల కుటుంబాలకు నిరాశేనా?
ఇదీ షెడ్యూలు..
ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయి సర్వే
21 నుంచి 24 వరకు వార్డు సభల్లో లబ్ధిదారుల వివరాల వెల్లడి
21 నుంచి 25 వరకు అర్హుల డేటా ఎంట్రీ
26 (రిపబ్లిక్ డే) నుంచి రేషన్ కార్డుల జారీ
జోన్ల వారీగా ఇలా..
జోన్ సర్వే జరగనున్న
కుటుంబాలు
ఎల్‌బీనగర్ 11,528
చార్మినార్ 21,257
ఖైరతాబాద్ 14,967
శేరిలింగంపల్లి 8,520
కూకట్‌పల్లి 12,580
సికింద్రాబాద్ 12,959
కంటోన్మెంట్ 1,474
మొత్తం 83,285
సర్కిళ్ల వారీగా అత్యధికంగా కార్వాన్ సర్కిల్‌లో 7,254 కుటుంబాలు, ఆ తర్వాత చాంద్రాయణగుట్టలో 6,275 కుటుంబాలున్నాయి. అత్యల్పంగా అల్వాల్ సర్కిల్‌లో 1,047 కుటుంబాలున్నాయి.
ఎదురు చూస్తున్న వారెందరో?
నిజానికి గ్రేటర్ పరిధిలోని నాలుగు జిల్లాల పరిధిలో దాదాపు పది లక్షల మంది రేషన్ కార్డుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణకు నిర్వహించిన ‘ప్రజాపాలన’ కార్యక్రమాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా దాదాపు 5.43 లక్షలున్నారు. మిగతావారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేదు. ఇంటింటి సర్వే సైతం నూరు శాతం జరగలేదు. కొందరు సర్వేను వ్యతిరేకించారు. వారిలో రేషన్‌కార్డుల్లేని వారికి సైతం ఇప్పుడు అవి అందే పరిస్థితి లేకుండాపోయింది. కుటుంబ సర్వే మేరకు రేషన్‌కార్డుల్లేని కుటుంబాలను పరిశీలించి వారికి మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
పాత మార్గదర్శకాలే
2014లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రేషన్‌కార్డులు లేనివారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, వాటిని కూడా పరిశీలించి కార్డులు జారీ చేస్తామన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కానీ.. ప్రజాపాలనలో అందిన దరఖాస్తులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అంతుచిక్కడంలేదు.
– క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హుల జాబితాను వార్డుసభలో వెల్లడించి చర్చించాకే ఆమోదిస్తారని ప్రభుత్వం పేర్కొంది. అలా ఎంపికై న వారి జాబితాను జీహెచ్‌ఎంసీ పరిధిలో కమిషనర్ లాగిన్‌కు పంపుతారు. వాటిని పరిశీలించి కమిషనర్ పౌరసరఫాల శాఖ కమిషనర్ లాగిన్‌కు పంపుతారు. పరిశీలించి కొత్త కార్డులు జారీ చేస్తారు. అర్హత కలిగిన వ్యక్తి పేరు ఒక్క రేషన్‌కార్డులో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఒకే వ్యక్తి పేరు ఒకటికి మించి కార్డుల్లో ఉండటానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సభ్యుల చేర్పులు, తొలగింపులు సైతం చేయనున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment