స్క్రాప్ మాటున గంజాయి అక్రమ రవాణా
నాగోలు: ఎవరికీ అనుమానం రాకుండా కంటైనర్‌లో స్క్రాప్ మెటీరియల్ మధ్య గంజాయి దాచి అరకు నుంచి మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్న కంటైనర్ డ్రైవర్‌ను అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, ఎస్‌ఓటీ మహేశ్వరం జోన్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన అతడి నుంచి 300 కిలోల గంజాయి, కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం ఎల్‌బీనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు..మహారాష్ట్ర, పూణె, రూపినగర్‌కు చెందిన అహ్మద్ గులాబ్ షేక్ డీసీఎం డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతను సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి అదే ప్రాంతానికి చెందిన వైభవ్, దేవాతో పరిచయం ఏర్పడింది. మాదకద్రవ్యాల దందా నిర్వహించే వారు తమ వద్ద డ్రైవర్‌గా పని చేయాలని అహ్మద్ గులాబ్ షేక్‌కు సూచించారు. ఏపీలోని విశాఖపట్నం నుంచి పూణె, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు గంజాయి తరలిస్తే ఒక్కో లోడ్‌కు రూ. 3 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు అంగీకరించిన అతను గతంలో విశాఖపట్నం నుంచి పూణేకు రెండు లోడ్‌ల గంజాయిని విజయవంతంగా డెలివరీ చేసి వైభవ్‌కు అప్పగించాడు. దానిని వైభవ్, దేవా పూణెలోని తమ ఏజెంట్లకు సరఫరా చేశారు. వైభవ్, దేవా సూచన మేరకు నిందితు డు అమ్మద్ గులాబ్ షేక్ ఇటీవల విశాఖపట్నం వెళ్లి బుజ్జిబాబు అనే వ్యక్తి నుంచి 300 కిలోల గంజాయి (138) ప్యాకెట్లు) సేకరించాడు. తనిఖీల సమయంలో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కంటైనర్‌లో ప్లాస్టిక్ స్క్రాప్‌లోడ్ చేసి దాని కింద గంజాయి దాచి హైదరాబాద్ మీదుగా పూణెకు తరలిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో ఎస్‌ఓటీ మహేశ్వరం జోన్ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెంట్ పోలీసులు గురువారం మధ్యాహ్నం రామోజీ ఫీల్మ్ సిటీ సమీపంలో కంటైనర్‌ను ఆపి సోదా చేయగా గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి గంజాయి, టాటా కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.05 కోట్లు ఉండవచ్చునని సీపీ పేర్కొన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ఎస్‌ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎల్‌బీనగర్, మహేశ్వరం అదనపు డీసీపీ ఎండీ షకీర్ హుస్సేన్, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అరకు నుంచి పూణెకు తరలింపు
300 కేజీల గంజాయి స్వాధీనం
కంటైనర్ డ్రైవర్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment