‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌’కు కమ్యూనిటీ హాల్‌ | - | Sakshi
Sakshi News home page

‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌’కు కమ్యూనిటీ హాల్‌

Published Fri, Feb 21 2025 8:53 AM | Last Updated on Fri, Feb 21 2025 8:49 AM

‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌’కు కమ్యూనిటీ హాల్‌

‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌’కు కమ్యూనిటీ హాల్‌

సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే జీహెచ్‌ఎంసీకి చెందిన రెండు మోడల్‌ మార్కెట్లను నిరుద్యోగ యువత, మహిళల ఉపాధి కల్పన పేరిట స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం సీఎస్సార్‌ కింద లైట్‌హౌస్‌ కమ్యూనిటీ ఫౌండేషన్‌కు అప్పగించిన జీహెచ్‌ఎంసీ.. మరో కమ్యూనిటీ హాల్‌ను అదే సంస్థకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణకు ఇచ్చేందుకు పచ్చ జెండా ఊపింది. గతంలో మోడల్‌ మార్కెట్లు అంటే ఎవరూ ముందుకు రానందున ఖాళీగా ఉన్నాయని ఇచ్చారు. ఈసారి మాత్రం బోరబండలోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్‌ను ఇచ్చేందుకు గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. స్థానిక బస్తీల్లోని పేదలు, సామాన్య ప్రజలకు వివిధ కార్యక్రమాల కోసం ఉపయోగపడాల్సిన కమ్యూనిటీ హాల్‌ను సైతం స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ఇస్తుండటంతో మున్ముందు ఇంకెన్ని జీహెచ్‌ఎంసీ ఆస్తులు శిక్షణల పేరిట బదలాయిస్తారోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారీగా భూ సేకరణలు..

కేబీఆర్‌ పార్కు చుట్టూ నిర్మించనున్న ఫ్లై ఓవర్టు, అండర్‌పాస్‌లకు 105 ఆస్తులు, ఆల్విన్‌ క్రాస్‌రోడ్‌, ఖాజాగూడ, తదితర ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, రహదారుల అభివృద్ధి పనులు తదితరాల కోసం మరో 455 ఆస్తులు వెరసీ.. మొత్తం 560 ఆస్తుల సేకరణకు కమిటీ పచ్చజెండా ఊపింది. వీటితో పాటు మొత్తం 15 అజెండా అంశాలు, ఆరు టేబుల్‌ అంశాలకు ప్రస్తుత స్టాండింగ్‌ కమిటీ చివరి సమావేశం ఆమోదం తెలిపింది.

ముఖ్యాంశాలు ఇలా..

● మిధాని బస్టేషన్‌, బస్‌ డిపో నిర్మాణాలకు ఆర్టీసీకి కేటాయించిన 5.37 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎన్‌ఓసీ.

● బీఆర్‌ఎస్‌ భవన్‌నుంచి బంజారా లేక్‌ వరకు ఎస్‌ఎన్‌డీపీ నిధుల నుంచి రూ.22.17 కోట్ల తో వరద కాల్వ నిర్మాణం, ఆధునికీకరణ.

● ఉప్పల్‌ సర్కిల్‌లోని చిలుకా నగర్‌ వివేకానంద విగ్రహం నుంచి కావేరీనగర్‌ కల్వర్టు వరకు రూ.6 కోట్ల అంచనా వ్యయంతో 100 మి.మీ. డయా పైపులైన్‌ నిర్మాణం.

● ప్రగతి నగర్‌ నుంచి మహదేవపురం వెటర్నరీ హాస్పిటల్‌ (వయా ఎల్లమ్మ బండ) వరకు ప్రతిపాదిత 30 మీటర్ల లింక్‌ రోడ్‌ అభివృద్ధికి అవసరమైన 8 ఆస్తుల సేకరణతో పాటు, రోడ్‌ను మాస్టర్‌ప్లాన్‌లో చేర్చేందుకు ప్రభుత్వానికి వినతి.

● దారుసలాం నుంచి చక్నావాడి కల్వర్టు వరకు రూ.7.40 కోట్లతో ఆర్‌సీసీ బాక్స్‌ డ్రెయిన్‌ నిర్మాణం.

● వీటన్నింటినీ పాలకమండలి ద్వారా ప్రభుత్వానికి నివేదించనున్నారు.

జోన్‌కు రూ.25 కోట్లు

జీహెచ్‌ఎంసీలో వివిధ అభివృద్ధి పనులకుగాను జోన్‌కు రూ.25 కోట్ల వంతున మొత్తం రూ.125 కోట్లు కేటాయించనున్నట్లు కమిషనర్‌ ఇలంబర్తి ఈ సందర్భంగా తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో ప్రజల కోసం పని చేద్దామన్నారు. రహదారుల విస్తరణ, జంక్షన్లు, పార్కులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీకి సంబంధించిన ఆస్తులు, వాటిపై వస్తున్న ఆదాయ వివరాలను అందించాలని అడిషనల్‌ కమిషనర్‌ (ఎస్టేట్స్‌) సమ్రాట్‌ అశోక్‌కు సూచించారు. జీహెచ్‌ఎంసీ ఆస్తులన్నింటినీ డిజిటలైజ్‌ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ సెక్రటరీ కె.సత్యనారాయణ, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, అడిషనల్‌, జోనల్‌ కమిషనర్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.

కమిషనర్‌, మేయర్‌తో స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, అధికారులు

సీఎస్సార్‌ కింద లైట్‌హౌస్‌ ఫౌండేషన్‌కు..

వివిధ ప్రాజెక్టుల కోసం 560 ఆస్తుల సేకరణ

రూ.22 కోట్లతో బీఆర్‌ఎస్‌ భవన్‌ నుంచి బంజారా లేక్‌ వరకు వరద కాల్వ ఆధునికీకరణ

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీలో ఆమోదం

రూ.700 కోట్లిచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు: మేయర్‌

రాష్ట్రప్రభుత్వం గడచిన సంవత్సర కాలంలో జీహెచ్‌ఎంసీకి రూ. 700 కోట్ల నిధులు విడుదల చేసిందని చెబుతూ సమావేశానికి అధ్యక్షత వహించిన మేయర్‌ విజయలక్ష్మి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్‌ఎంసీకి ఎంతో ఆదాయాన్నిచ్చే క్రీడాప్రాంగణాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement