
ఉద్యానం.. అభివృద్ధి స్వచ్ఛందం
రాజధానిలోని చెరువుల అభివృద్ధి కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నిధులు కేటాయిస్తుండగా... పార్కుల్ని తమకు అప్పగించాలంటూ పలు స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీఓ) హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని (హైడ్రా) కలుస్తున్నాయి. కబ్జా చెర నుంచి విడిపించిన వాటితో పాటు తమ ప్రాంతాల్లో ఉన్నవీ అప్పగిస్తే వాటిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి స్థానికులకు అందుబాటులోకి తీసుకువస్తామని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి, తదుపరి వచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. –సాక్షి, సిటీబ్యూరో
హైడ్రా అధికారులు ఓఆర్‌ఆర్ పరిధిలో ఉన్న జలవనరులతో పాటు ప్రభుత్వ స్థలాలను పరిరక్షించే బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. ఏదైనా లేఔట్‌కు అనుమతి పొందే సమయంలో దాని యజమానులు పార్కుతో పాటు కామన్ ఏరియాలను విడిచిపెట్టడం అనివార్యం. తొలినాళ్లల్లో వీటిని ఓపెన్ ప్లేసులుగానే వదిలేస్తున్న యజమానులు కాలక్రమంలో ప్లాట్‌గా మార్చి అమ్మేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఆ ప్రాంతానికి అటు–ఇటు ఉన్న ప్లాట్ల యజమానులు కబ్జా చేస్తున్నారు. ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో కాలనీ నుంచి పార్కులు, ఓపెన్ స్పేస్‌లు, కామన్ ఏరియాలు మాయమవుతున్నాయి. లేఔట్ వేసే సమయంలో వదిలే ఈ ప్రాంతాలన్నీ ప్రభుత్వ స్థలాల పరిధిలోకే వస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
పరుసగా ఫిర్యాదులు..
కొన్నేళ్లుగా నగరంలో ఈ కబ్జా పర్వం నడుస్తోంది. అయితే.. ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎలా ఫిర్యాదు చేయాలి? అనేది అంశాలు తెలియక కొందరు.. ప్రభుత్వ విభాగాల చుట్టూ ప్రదక్షిణలు చేయలేక మరికొందరు మిన్నకుండిపోతున్నారు. హైడ్రా ఏర్పడిన తర్వాత ఈ కబ్జాలపై ఫిర్యాదులు మొదలు కాగా... ఆ విభాగంలో ప్రజావాణి నిర్వహణ ప్రారంభించిన తర్వాత జోరందుకున్నాయి. తమకు వచ్చే ఫిర్యాదుల పూర్వాపరాలు, రికార్డులు, డాక్యుమెంట్లు పరిశీలిస్తున్న హైడ్రా అధికారులు పార్కుల్లో ఉన్న కబ్జాలను తొలగిస్తున్నారు. అక్కడ నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తూ పరిరక్షించాల్సిందిగా ఆయా ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాస్తున్నారు. కొన్ని కాలనీల్లో ఆయా సంక్షేమ సంఘాలే ఈ బాధ్యతల్ని చేపడుతున్నాయి.
ఆసక్తి చూపిస్తున్న ఎన్‌జీఓలు..
నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎన్‌జీఓలు యాక్టివ్‌గా పని చేస్తున్నాయి. కొన్ని సంస్థలు నగర వ్యాప్తంగా తమ సేవల్ని విస్తరించాయి. ఇలాంటి కొన్ని ప్రతిష్టాత్మక సంస్థల నుంచి హైడ్రాకు విజ్ఞప్తులు వస్తున్నాయి. కొన్ని పార్కుల్ని తమకు అప్పగిస్తే వాటిని అభివృద్ధి చేయడంతో పాటు నిర్వహణ బాధ్యతలు చేపడతామని కోరుతున్నాయి. అయితే గత ప్రభుత్వం కొన్ని చెరువులన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించింది. అభివృద్ధి పనులంటూ వారు చేపట్టిన చర్యల వల్ల ఆయా జలవనరులకు లాభం కంటే నష్టమే జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న హైడ్రా అధికారులు పూర్తి సమాచారాన్ని, విధివిధానాలను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. ఆపై సర్కారు తీసుకునే నిర్ణయం, ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ’సాక్షి’కి తెలిపారు.
యథావిధిగా నేటి ప్రజావాణి...
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గంలో శనివారం దుర్ఘటన చోటు చేసుకున్న విషయం విదితమే. ఆ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించడానికి వివిధ ప్రభుత్వ విభాగాలు రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నారు. దీనికోసం నగరం నుంచి హైడ్రా బృందాలు కూడా తరలివెళ్లాయి. కమిషనర్ ఏవీ రంగనాథ్ సైతం ఈ బృందాలతో పాటు శనివారం రాత్రి అక్కడికి వెళ్లారు. రాణిగంజ్‌లోని బుద్ధ భవన్‌లో ఉన్న హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి.. కమిషనర్ రంగనాథ్ అందుబాటులో లేనప్పటికీ ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని హైడ్రా ప్రకటించింది.
హైడ్రా కమిషనర్‌ను కలుస్తున్న ఎన్‌జీఓల ప్రతినిధులు
తమ ప్రాంతాల్లోని పార్కులు అప్పగించాలని వినతులు
చెరువులూ అభివృద్ధి చేసేందుకు కొన్ని సంఘాల ఆసక్తి
ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలని హైడ్రా నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment