
కాంక్రీట్ లారీ ఢీ.. కారు నుజ్జునుజ్జు
యువకుడి దుర్మరణం
దుండిగల్: ఎదురుగా వస్తున్న కారును కాంక్రీట్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దూలపల్లి ప్రాంతానికి చెందిన దున్నాల నాగ వంశీ (22) ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. ఆదివారం ఉదయం కారులో మియాపూర్ నుంచి గండిమైసమ్మ చౌరస్తా వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో గండిమైసమ్మ నుంచి ప్రగతినగర్ వైపు వస్తున్న కాంక్రీట్ లారీ బౌరంపేట స్నేక్ పార్క్ చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న నాగ వంశీ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో నాగ వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంతో బైక్‌పై వస్తున్న బాచుపల్లికి చెందిన చిట్టూరి వెంకట సురేంద్ర, గోపాల్ కారును వెనుక నుంచి ఢీకొట్టారు. సురేంద్రకు కాలు విరిగిపోవడంతో సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన నాగవంశీ మృతదేహాన్ని జేసీబీ బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. లారీ డ్రైవర్ రాములు పరారీలో ఉన్నాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment