
ఎండాకాలం.. ఏదీ సన్నద్ధత?
రోజుకు 5.05 లక్షల మందికి పైగా మెట్రో జర్నీ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో ప్రయాణం రోజు రోజుకూ నరకప్రాయంగా మారుతోంది. లక్షలాది మంది కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు నిల్చుని ప్రయాణం చేసే సదుపాయం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేకుండాపోయింది. చోటులేనంతగా రైళ్లు భర్తీ అవుతున్నాయి. రాత్రింబవళ్లూ అన్ని కారిడార్‌లలో, అన్ని సమయాల్లోనూ ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. పట్టాలపై నడిచే రైళ్లలో ఉండే ప్రయాణికులకు రెట్టింపుగా మెట్రోస్టేషన్‌లలో పడిగాపులు కాయాల్సివస్తోంది. రోజు రోజుకూ పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసేందుకు రెండేళ్ల క్రితమే ప్రణాళికలను రూపొందించారు. కానీ.. ఇప్పటివరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం సుమారు 5.05 లక్షల నుంచి 5.10 లక్షల మంది మెట్రోల్లో ప్రయాణం చేస్తుండగా ఈ వేసవిలో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ నాటికి 5.5 లక్షలకు చేరవచ్చని అంచనా. ఇప్పటికే రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. పెరగనున్న రద్దీ రైళ్ల నిర్వహణలో భారంగా మారనుంది. వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనపు కోచ్‌లు, అదనపు సర్వీసులను పెంచేందుకు అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
ఎన్నాళ్లీ పడిగాపులు?
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొత్త కోచ్‌లను కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వ హయాంలోనే సన్నాహాలు చేపట్టారు. అద్దె ప్రాతిపదికన కోచ్‌లను తెప్పించాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ప్రయాణికుల డిమాండ్ మేరకు కొత్త కోచ్‌లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. కానీ.. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రతిపాదన కార్యాచరణకు నోచుకోలేదు. ఈ ఏడాది కాలంలోనే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయినప్పటికీ 3 కోచ్‌లలోనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇప్పుడు ఉన్న 3 కోచ్‌లను 6కు పెంచేందుకు నాగపూర్ మెట్రో రైల్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు అప్పట్లో పేర్కొన్నారు. కానీ.. ఆ మేరకు ఎలాంటి పురోగతీ లేదు. మరోవైపు ఈ ఏడాది కాలంగా అదనపు కోచ్‌లను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు పదే పదే చెబుతూనే ఉన్నారు.
ఎండలు ముదురుతున్నాయి..
● రాయదుర్గం– నాగోల్, ఎల్‌బీనగర్– మియాపూర్ రూట్‌లలో నడిచే రైళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రెండు కారిడార్‌లలో ప్రధాన స్టేషన్‌లలో ప్రతి రోజూ 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. అమీర్‌పేట్, రాయదుర్గం, ఎల్‌బీనగర్ స్టేషన్‌లలో లక్ష మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు సైతం ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆర్టీసీ వివిధ మార్గాల్లో సుమారు 240 ఏసీ బస్సులను నడుపుతున్నప్పటికీ ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున అందుబాటులో ఉండే మెట్రో సర్వీసు ల వైపే ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు.
● ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు సకాలంలో చేరేందుకు అనుకూలంగా ఉండడంతో మెట్రో రైళ్ల ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం ప్రతి రోజూ సుమారు 1,065 ట్రిప్పులు నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.కానీ ఇప్పుడు ఉన్న రద్దీ దృష్ట్యా 3 నిమిషాలకు ఒక రైలు నడిచినా రైల్లో నిలబడేందుకు చోటులేకపోవడంతో మరో ట్రైన్ కోసం ప్లాట్‌ఫామ్‌లపై పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఐటీ ఉద్యోగులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే వారు ఇబ్బందులకు గురవుతున్నారు.
కిక్కిరిసిపోతున్న మెట్రో సర్వీసులు
ఈ వేసవిలో 5.50 లక్షలకు చేరే అవకాశం
మెట్రో అదనపు సర్వీసులపై మీనమేషాలు
రెండేళ్లుగా పెరిగిన కొత్త కోచ్‌ల డిమాండ్