
ఆర్‌జీఐఏ పోలీస్ ఔట్‌పోస్టు ప్రారంబోత్సవంలో సీపీ అవినాష్ మహంతి, సీఐ బాలరాజు తదితరులు
బాధితులు శంషాబాద్‌కు రానవసరం లేదు
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి
శంషాబాద్: ‘శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరిగాయి. అభివృద్ధి జరిగిన చోట కొన్ని రకాల సమస్యలు కూడా పెరుగుతుంటాయి. వాటి పరిష్కారానికి అనుగుణంగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆర్‌జీఐఏలో పోలీస్‌స్టేషన్ ఔట్‌పోస్టును ప్రారంభించాం’ అని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఇకపై ఎయిర్‌పోర్టుకు సంబంధించిన ఫిర్యాదులన్నీ ఔట్‌పోస్టు పరిధిలో ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
బాధితులు ఫిర్యాదులు ఇచ్చేందుకు శంషాబాద్ పట్టణానికి రానవసరం లేదని సూచించారు. ఎయిర్‌పోర్టులో గతంలో కేవలం ఆరుగురు పోలీసు సిబ్బంది మాత్రమే ఉండేవారని, ప్రస్తుతం ఓ సీఐ, ఇద్దరు ఎస్సైలతో పాటు ఇరవైమంది సిబ్బందితో ఔట్‌పోస్టు కొనసాగనుందన్నారు. ఇమిగ్రేషన్, సీఐఎస్‌ఎఫ్ తదితర ఏజెన్సీలతో సమన్వంగా కలిసి పనిచేసి శాంతిభద్రతలు, నేరాల నియంత్రణకు పోలీసులు పని చేస్తారన్నారు.
వేర్వేరుగా మారొచ్చు..
శంషాబాద్ ఎయిర్‌పోర్టు కార్యకలాపాలతోపాటు శంషాబాద్ పట్టణ పరిధి కూడా పెరిగిన కారణంగా వీకేంద్రికరణ చేసినట్లు సీపీ తెలిపారు. భవిష్యత్‌లో ప్రస్తుత ఆర్‌జీఐఏ పోలీస్ ఔట్‌పోస్టు పూర్తి ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌గా పట్టణంలో ఉన్న ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ శంషాబాద్ టౌన్ పీఎస్‌గా మారేందుకు అవకాశాలున్నాయని చెప్పారు.
ఔట్‌పోస్టు సీఐగా బాలరాజు
కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పోస్టు సీఐగా జె.బాలరాజు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆయన సీపీ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో ఎయిర్‌పోర్టు సీఈఓ ప్రదీప్ ఫణీకర్, శంషాబాద్ డీసీపీ రాజేష్, ఏసీపీ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.