
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పదో తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్లపై విద్యా, రెవెన్యూ, పోలీస్, వైద్య, పోస్టల్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు నగరంలో 358 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని, వీటి పరిధిలో 77,701 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక చొప్పున సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో పేపర్ల తనిఖీ నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ ఈ.వెంకటాచారి, డీఈఓ ఆర్ రోహిణి, డీఎంహెచ్‌ఓ వెంకటి, అదనపు డీసీపీ రవీందర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏడీఈ ప్రార్థన, డిప్యూటీ ఆర్‌ఎం భీంరెడ్డి, పర్యవేక్షకులు జహీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు