
హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: అమీన్‌పూర్ పెద్ద చెరువులో ఎఫ్‌టీఎల్ సరిహద్దుల నిర్ధారణ పేరిట జరుగుతున్న దందాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ పేరుతో పలువురు దందాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. జేఏసీ తరఫున కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు రసీదులు, వాట్సాప్ సందేశాలతో శనివారం రంగనాథ్‌ను కలిసి విన్నవించారు.
చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధారణపై హైడ్రా చేస్తున్న కసరత్తును ఆసరాగా తీసుకుని ఎవరైనా దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దందాలకు పాల్పడిన వారిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు చేయాలని బాధితులకు సూచించారు. హైడ్రా నుంచి కూడా కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 95 ఎకరాలుండే చెరువు 450 ఎకరాలకు ఎలా విస్తరించిందనే విషయమై హైడ్రా లోతైన విశ్లేషణ చేస్తోందని, ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో కూడా ఉందన్నారు.
గ్రామ రికార్డులు, సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇమేజీలతో సరిపోల్చడమే కాకుండా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి ఎఫ్‌టీఎల్ నిర్ధారణ పూర్తి చేస్తామని కమిషనర్ చెప్పారు. జేఎన్‌టీయూ, ఐఐటీ కళాశాలల వారి భాగస్వామ్యంతో కమిటీ వేసి ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారిస్తామన్నారు. రెండు, మూడు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. నీట మునిగిన లే ఔట్ల ప్లాట్లను కాపాడేందుకు ఖర్చు అవుతుందని దందాలు చేస్తున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment