![After US Another China spy balloon spotted over Latin America - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/4/China_Another_Spybaloon.jpg.webp?itok=CY_lrsYk)
వాషింగ్టన్: అమెరికా గగనతలంలో చైనా నిఘా బెలూన్.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైంది. అదీ అణుస్థావరం వద్ద బెలూన్ సంచరించడంతో తీవ్రంగా పరిగణించిన అమెరికా.. తమ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ‘చైనా పర్యటన’ను వాయిదా వేయించింది. అయితే.. అది నిఘా బెలూన్ కాదని చైనా వివరణ ఇచ్చేలోపే.. ఇప్పుడు మరో బెలూన్ వ్యవహారం వెలుగు చూసింది.
లాటిన్ అమెరికా రీజియన్ గగనతలంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మరో బెలూన్‌ను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ధృవీకరించింది. ఒక బెలూన్ లాటిన్ అమెరికా దిశగా ప్రయాణిస్తున్నట్లు మేం నివేదికలను పరిశీలించాం. ఇది చైనీస్ నిఘా బెలూన్‌గానే భావిస్తున్నాం అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్రిక్ రైడర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అయితే.. అది చైనాదేనా? లేదా మరేదైనా దేశం నుంచి ప్రయోగించారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు.. ఆ బెలూన్ సంచారాన్ని గమనిస్తే అది అమెరికా వైపుగా పయనిస్తున్నట్లు కనిపించడం లేదని ఓ భద్రతాధికారి చెప్తున్నారు. అయినప్పటికీ రాబోయే రోజుల్లో దాని సంచారం ఎటువైపు ఉందో ట్రేస్ చేయాల్సిన అవసరం ఉందని పెంటగాన్ పేర్కొంది.
అంతకు ముందు అమెరికా గగనతలంలో మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఓ బెలూన్.. సంచరించడం కలకలం రేపింది. గురువారం ఏకంగా మోంటానా(అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి ఉంది)లో ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అయితే అత్యంత ఎత్తులో ఎగరడం వల్ల విమానాల రాకపోకలకు దానివల్ల అంతరాయమేమీ కలగలేదు. అయినప్పటికీ కీలక సమాచారం లీక్ అయ్యే ఛాన్స్ ఉండడంతో.. అమెరికా జాగ్రత్త పడింది. దానిని పేల్చినా.. కూల్చినా.. ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోననే ఆందోళనతో కేవలం నిఘా మాత్రమే పెట్టింది అమెరికా రక్షణ శాఖ.
ఈ బెలూన్ వ్యవహారాన్ని పెంటగాన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టికి తీసుకెళ్లింది. చైనాతో చర్చల నిమిత్తం శుక్రవారం రాత్రి బయల్దేరాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ పర్యటన వాయిదా పడింది. వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా పేర్కొంది. ఈ అనుకోని పరిణామానికి చింతిస్తున్నట్టు చెప్పింది. కానీ, ఈ వివరణతో అమెరికా సంతృప్తి చెందలేదు.
Comments
Please login to add a commentAdd a comment