రూప్‌పూర్ అణు ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు
ఆపద్ధర్మ ప్రభుత్వం ఆరోపణలు
విచారణ చేపట్టిన అవినీతి నిరోధక విభాగం
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఏకైక అణు విద్యుత్ కర్మాగారం నిర్మాణంలో పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా రూ.41.46 వేల కోట్ల మేర లంచం తీసుకున్నారని ఆపద్ధర్మ ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై అవినీతి నిరోధక విభాగం తాజాగా విచారణ చేపట్టినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రూప్‌పూర్ అణు ప్లాంట్ డిజైన్, నిర్మాణ బాధ్యతలను రష్యా ప్రభుత్వ రంగ సంస్థ రోసటోమ్ తీసుకోగా, నిర్మాణ పనులను భారతీయ కంపెనీలు చేపట్టాయి.
రూప్‌పూర్ పవర్ ప్రాజెక్ట్ నుంచి షేక్ హసీనా, ఆమె కుమారుడు జాయ్, బంధువు తులిప్ సిదిఖీలు మలేసియా బ్యాంకుకు చేసిన రూ.41.46 వేల కోట్ల బదిలీని అక్రమంగా ఎందుకు ప్రకటించలేదంటూ రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ హైకోర్టు దేశ యాంటీ కరప్షన్ కమిషన్(ఏసీసీ)ను ప్రశ్నించిన నేపథ్యంలోనే ఈ దర్యాప్తు చేపట్టినట్లు మీడియా తెలిపింది.
నేషనల్ డెమోక్రాటిక్ మూవ్‌మెంట్(ఎన్‌డీఎం) చైర్మన్ బాబీ హజాజ్ అవినీతి జరిగిందంటూ మొదటిసారిగా ఆరోపించారు. రూప్‌పూర్ అణు ప్లాంట్ నిర్మాణంలో అవినీతి అంటూ వచి్చన ఆరోపణలను రష్యా ప్రభుత్వ సంస్థ రోసటోమ్ తీవ్రంగా ఖండించింది. షేక్ హసీనా, సోదరి రెహానాతోపాటు ప్రస్తుతం భారత్‌లో ఉండగా, ఆమె కుమారుడు జాయ్ అమెరికాలో ఉంటున్నారు. వీరి బంధువు తులిప్ సిద్దిఖీ బ్రిటన్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో అల్లర్లు, హింసాత్మక ఘటనలపైనా ఆపద్ధర్మ ప్రభుత్వం హసీనాతోపాటు ఆమె కేబినెట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులపైనా జన హననం కేసులు నమోదయ్యాయి. ఆమెను అప్పగించాలంటూ రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భారత్‌ను అధికారికంగా కోరడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment