![black or Indian: Donald Trump questions Kamala Harris racial identity](/styles/webp/s3/article_images/2024/08/2/trup.jpg.webp?itok=y3HwaN80)
కమలపై ట్రంప్ వివక్షపూరిత వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కానున్న కమలా హారిస్ భారతీయురాలా? లేక నల్ల జాతీయురాలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఆమె చాలాకాలంగా భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌గా తెలుసని, ఇప్పుడు హఠాత్తుగా నల్లజాతీయురాలినని చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు.
షికాగోలో బుధవారం జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ కన్వెన్షన్‌లో ట్రంప్ మాట్లాడారు. వేదికపై ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టులలో ఒకరు.. ‘హారిస్ ఎప్పుడూ నల్లజాతీయురాలిగానే గుర్తింపును కోరుకున్నారు. నల్లజాతీయుల యూనివర్సిటీలోనే చదువుకున్నారు’ అని చెప్పడానికి ప్రయత్నించగా ట్రంప్ అడ్డుపడ్డారు.
ఆమె ఏదో ఒకదానికి కట్టుబడితే గౌరవిస్తానని, కానీ గతంలో భారతీయ వారసత్వం గురించి చెప్పుకున్న ఆమె అకస్మాత్తుగా నల్లజాతి వైపు మలుపు తిరిగారని, ఎవరైనా దానిని పరిశీలించాలని వ్యాఖ్యానించారు. న్యాయవాదిగా ఆమె బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని, పాస్ అవుతానని కూడా ఆమె అనుకోలేదని, ఆ తరువాత ఏమి జరిగిందో తనకు తెలియదని ఎద్దేవా చేశారు. అంతకుముందు రోజు ఫాక్స్‌న్యూస్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో సైతం ట్రంప్ అభ్యంతరకరంగా మాట్లాడారు. కమల అధ్యక్షురాలిగా ఎన్నికైతే ప్రపంచవ్యాప్తంగా నేతలు ఆమెను ఆట బొమ్మలా చూస్తారని, ఆమె చుట్టూరా తిరుగుతారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment