
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ జాతి వివక్ష వ్యాఖ్యలకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ మళ్లీ తన పాత విభజన సిద్ధాంతాన్నే ముందుకు తెస్తున్నారని, అగౌరవపరిచే ధోరణి కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి విభజనవాది కాకుండా, అమెరికాకు నిజాలు మాట్లాడే నాయకులు, వాస్తవాలను ఎదుర్కోవాల్సి వచి్చనప్పుడు.. శత్రుభావంతో, ఆగ్రహంతో ఊగిపోకుండా అర్థం చేసుకునే నాయకులు కావాలని ఆమె అభిప్రాయపడ్డారు.
హూస్టన్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న వైరుధ్యాలు విభజనకు తావివ్వకూడదని, అవే మన బలమని తెలిసిన నాయకుడు అమెరికాకు కావాలని చెప్పారు. అమెరికా ప్రజలను విభజించడానికి ట్రంప్ ప్రయ్నతిస్తున్నారని హారిస్ ఎన్నికల ప్రచార డైరెక్టర్ మైఖేల్ టేలర్ విమర్శించారు. మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలు అవమానకరమైనవిగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ పెర్రీ పేర్కొన్నారు. వ్యక్తులను ఎలా గుర్తించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని, అది ఎవరికి వారు సొంతగా తీసుకునే నిర్ణయమన్నారు.