వాషింగ్టన్: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి ఏ మార్గాౖన్నైనా అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నా మని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంథోని బ్లింకెన్ రష్యాకు హెచ్చరిక చేశారు. ఈ మేరకు ఆయన రష్యా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎలాంటి దారి ఎంచుకోవాలో రష్యానే నిర్ణయించుకోవాలన్నారు. లేఖలో రష్యా చర్యలపై యూఎస్, మిత్రపక్షాల ఆం దోళనను వివరించామని, రష్యా వెలిబుచ్చిన సందేహాలకు సమాధానమిచ్చామని చెప్పారు.
సమస్య పరిష్కారానికి తమవద్ద ఉన్న పరిష్కారాలను సూచించామని తెలిపారు. ఉక్రెయిన్ సార్వ భౌమత్వాన్ని కాపాడడం సహా దేశాల హక్కుల పరిరక్షణకు కట్టుబడిఉన్నామని చెప్పారు. రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఉక్రెయి న్, యూరప్ మిత్రపక్షాలను సంప్రదించి ఈ లేఖ రాసినట్లు బ్లింకెన్ తెలిపారు. అనంతరం ఆయన ఈ విషయాలను కాంగ్రెస్ లీడర్లకు వివరించారు.
నాటో తరఫున రష్యాకు మరో సందేశాన్ని విడిగా పంపినట్లు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్‌స్టాల్టెన్‌బర్గ్ తెలిపారు. మిలటరీ చర్య నివారణకు అవసరమైన మార్గాలు, ఆయుధ నియంత్రణ, చర్చలు జరపడం తదితర అంశాలను ఇందులో ప్రస్తావించామన్నారు. అయితే ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వకూడదన్న రష్యా అభ్యర్ధనపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అటు బ్లింకెన్, ఇటు జెన్స్ బహిర్గతం చేయలేదు. ఉక్రెయిన్, జార్జియా, మోల్డోవాల్లో మోహరించిన బలగాలను రష్యా ఉపసంహరించుకోవాలని జెన్స్ డిమాండ్ చేశారు.
ఫ్రాన్స్ సెపరేటు రూటు
ఒకపక్క యూఎస్, నాటో దేశాలు రష్యాకు హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తున్న వేళ ఫ్రాన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. ఉక్రెయిన్ అంశంలో ఇంకా చర్చలకు అవకాశం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియల్ మాక్రాన్ అభిప్రాయపడుతున్నారు. యుద్ధాల కన్నా రష్యాతో చర్చలే మేలంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికాకు వంతపాడడాన్ని ఫ్రాన్స్ మానేసింది. పైగా వచ్చే ఏప్రిల్‌లో దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో యుద్ధమంటే వ్యతిరేకత వస్తుందని మాక్రాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఫ్రాన్స్ చర్చల పాట పాడుతోంది.
ఇందులో భాగంగా శుక్రవారం రష్యా అధినేత పుతిన్‌తో మాక్రాన్ చర్చలు జరపబోతున్నారు. బుధవారం మాక్రాన్ నివాసంలో రష్యా, ఉక్రెయిన్ సలహాదారుల మధ్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరో రెండు వారాల్లో మరలా చర్చలు జరపాలని ఇందులో నిర్ణయించారు. తొలినుంచి కూడా రష్యా పట్ల మాక్రాన్ సామరస్య ధోరణినే కనబరుస్తూ వస్తున్నారు. పైగా జోబైడెన్ అధ్యక్షుడైన తర్వాత ఫ్రాన్స్, అమెరికా మధ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌కు ఎన్ని యూరప్ దేశాలు మద్దతు పలుకుతాయో వేచిచూడాలని నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment