
లేదంటే తిరుగుబాటును ఎదుర్కొనేందుకు సిద్ధంకండి
కెనడా ప్రధాని ట్రూడోకు సొంత పార్టీ సభ్యుల అల్టిమేటం
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఊహించని షాక్ ఎదురైంది. అక్టోబర్ 28లోగా రాజీనామా చేయాలని అధికార లిబరల్ పార్టికి చెందిన కొందరు సభ్యులు అల్టిమేటం జారీచేశారు. రాజీనామా చేయకపోతే తిరుగుబాటును ఎదుర్కొనేందకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ప్రభుత్వ వైఖరి కారణంగా భారత్, కెనడా దౌత్య సంబంధాల్లో ప్రతిష్టంభన నెలకొనడం తెల్సిందే.
ఈ నేపథ్యంలో లిబరల్ ఎంపీలతో ట్రూడో సమావేశమయ్యారు. బుధవారం జరిగిన ఈ అంతర్గత సమావేశంలో దాదాపు 20 మంది సభ్యులు ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఊహించి ఈ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే మూడు గంటల పాటు జరిగిన సమావేశం అనంతరం చిరునవ్వులు చిందిస్తూ బయటికి వచ్చిన ట్రూడో.. లిబరల్స్ ఐక్యంగా, బలంగా ఉన్నారని మీడియాకు వెల్లడించారు. పార్టిలోని 153 మంది చట్టసభ సభ్యుల్లో 24 మంది ట్రూడో నాలుగోసారి పోటీ చేసే ప్రణాళికలను విరమించుకోవాలని, ప్రధాని పదవికి రాజీనామా చేయాలని కోరుతూ లేఖపై సంతకాలు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment