వీటి ముందు కిలికిలి భాష బేకార్‌! | Do You Know Alien languages Like Fith Lincos Rikchik AUI | Sakshi
Sakshi News home page

వీటి ముందు కిలికిలి భాష బేకార్‌!

Published Sat, Dec 30 2023 9:10 AM | Last Updated on Sat, Dec 30 2023 12:19 PM

Do You Know Alien languages Like Fith Lincos Rikchik AUI - Sakshi

బాహుబలి సినిమాలో కాలకేయుల భాష గుర్తుందా? ‘కిలి కిలి’ భాష. అర్థం కాక మనమందరం కాసేపు జట్టుపీక్కున్న వాళ్లమే! కానీ.. కింది భాషల గురించి తెలుసుకుంటే.. అబ్బే.. ‘కిలి కిలి’ చాలా సుందరమైన, సులువైన భాష అని అనక మానరు మీరు! ఇంకో విషయం.. ఈ భాషలను అప్పుడు.. ఇప్పడు.. ఎవరూ మాట్లాడలేదు! ఏమిటీ విచిత్రం అనుకోక ముందే... చదవడం మొదలుపెట్టేయండి! గ్రహాంతర వాసలు గురించి మీరిప్పటికే కథలు కథలుగా విని ఉంటారు కాబట్టి.. మనం వాటిజోలికి పోవద్దు.

ఇప్పటివరకూ మనిషి గ్రహాంతర వాసిని ప్రత్యక్షంగా చూసింది లేదు.. మాట్లాడింది అంతకంటే లేదు. కానీ.. ఎప్పుడో.. రేప్పొద్దున అంటే భవిష్యత్తులో వారితో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే...?? ఏం మాట్లాడతాం? ఎలా మాట్లాడతాం? తెలుగు, హిందీ, ఇంగ్లీషులు వారికి వస్తాయో రావో మనకు తెలియదు కదా! ఈ సమస్యను గుర్తించే కొందరు భాషా శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసులను కలిస్తే మాట్లాడేందుక ఏకంగా ఆరు భాషలను సిద్ధం చేశారు. కిలికిలి భాష మాదిరే ఈ భాషలను కూడా ఉద్దేశపూర్వకంగా నిర్మించారు కాబట్టి వీటిని కన్‌స్ట్రక్టెడ్‌ లాంగ్వేజెస్‌ క్లుప్తంగా కాన్‌లాంగ్స్‌ అని పిలుస్తున్నారు. ఎక్సోలాంగ్స్‌ అని కూడా వీటికి పేరు! ఒక్కో దాని గురించి స్థూలంగా...

1. ఫిథ్‌ (Fith):

గ్రహాంతర వాసుల కోసం సిద్ధం చేసిన చాలా భాషలు మానవ భాషలు అన్నింటికీ వర్తించే వ్యాకరణ సూత్రాలను ఉపయోగిస్తాయి. జెఫ్రిహెన్నింగ్స్‌ అనే భాష శాస్త్రవేత్త ఒక అడుగు ముందుకేసి ఈ సామాన్య వ్యాకరణ సూత్రాలన్నింటినీ అతిక్రమించేలా ఒక భాషను రూపొందిచాడు. Forth అనే కంప్యూటర్‌ లాంగ్వేజ్‌, పోస్ట్‌ఫిక్స్‌ నొటేషన్‌ కాలిక్యులేటర్లు (వీటిల్లో 2 + 4 అని రాసేందుకు బదులు 2 4 + అని రాస్తారు) స్ఫూర్తిగా తాను ఫిథ్‌ను రూపొందించినట్లు జెఫ్రీ చెబుతున్నారు.

అంటే తెలుగులో మనం ‘రాముడు మంచి బాలుడు’ అని రాస్తే... ఫిథ్‌లో ‘రాముడు బాలుడు మంచి’ అని రాయాల్సి ఉంటుందన్నమాట. సంసృ‍్కతంలో పదకొండును ఏకాదశి (ఏక అంటే ఒకటి, దశ అంటే పది) అని పిలిచినట్టు అన్నమాట. ఫిథ్‌ కానీ.. సంసృ‍్కతం కానీ.. మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవడం సులువే కానీ... రాతలో ఉంటే మాత్రం చాలా కష్టం! ఇలాంటి క్లిష్టమైన భాషలో రెండు చేతి గుర్తులు కూడా భాగంగా ఉంటే.. మానవ మెదడు హీటెక్కాల్సిందే! ఫిథ్‌ మాట్లాడే గ్రహాంతర వాసుల ఒక్కో చేతికి రెండు అంగుష్టాలు ఉంటాయన్నది జెఫ్రీ ఊహ)

ఫిథ్‌లో ఒక ఉదాహరణ... Zhong hong lin lo, అన్న పదాలను ఇంగ్లీషులోకి తర్జుమా చేస్తే “nation man loyal of.” అని వస్తుంది. పదాలు తారుమారైనట్లుగా ఉంది కదా? అవును. ఈ వాక్యం అర్థం దేశానికి నమ్మకమైన వ్యక్తి అని. ఇంకోలా చెప్పాలంటే దేశభక్తుడూ అని!.

2. రిక్‌చిక్‌...

పేరు భలే చిత్రంగా ఉందే అనుకుంటున్నారా? భాష మరింత విచిత్రంగా ఉంటుంది. డెనిస్‌ మోస్కోవిట్జ్‌ సిద్ధం చేశాడు దీన్ని. పచ్చ రంగులో ఉండే ఒంటి కన్ను గ్రహాంతర వాసులు ఈ భాష మాట్లాడాతరన్నది డెనిస్‌ కల్పన. ఆల్ఫా సెంటూరైలో ఉంటారీ గ్రహాంతర వాసులన్నదీ ఆయన ఊహల్లోని విషయమే. రిక్‌చిక్స్‌ వినలేరు! కానీ.. ఒక్కో రిక్‌చిక్‌ శరీరంపై 49 తోకల్లాంటివి వేలాడుతూంటాయి. వీటిల్లో ఏడింటిని చేతులుగా వాడుకుంటూంటాయి. వీటితో చేసే సంకేతాలే రిక్‌చిక్‌ భాష అన్నమాట. ఇదంతా డెనిస్‌ సృష్టేనండోయ్‌! రిక్‌చిక్‌ల మాదిరిగా బోలెడన్ని చేతుల్లేని కారణంగా మనం వాటితో రాతపూర్వకమైన భాష ద్వారా మాత్రమే మాట్లాడగలం.

లోగోలత కూడిన రిక్‌చిక్‌ భాషలో ఒక్కో పదంలో నాలుగు భాగాలుంటాయి. మధ్యలో పదం ప్రాథమిక అర్థం. ఉంటే ఆ పదం క్రియ? ప్రాంతం, ప్రాణమున్నదా? లేనిదా? అన్న వివరాలు చెబుతుంది. ఇది దిగువన ఎడమవైపున ఉంటుంది. ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని సూచించే గుర్తు కుడివైపు... చిన్న అక్షరమా? పెద్ద అక్షరమా అని చెప్పే భాగం పైన ఉంటుంది. రిక్‌చిక్‌ భాష 2012లో స్మైలీ అవార్డును గెలుచుకుంది కూడా.

3. ద్రిటోక్‌:
డాన్‌ బూజర్‌ అనే శాస్త్రవేత్త సిద్ధం చేసిన ఏలియన్‌ లాంగ్వేజ్‌ ఇది. ఎలుక కిచకిచలను పోలినట్టు ఓ భాషను తయారు చేయవచ్చా? అన్న సింపుల్‌ ఆలోచన నుంచి ద్రిటోక్‌ పుట్టుకొచ్చిందని డాన్‌ చెబుతారు. అయితే ఈ భాషను సిద్ధం చేయడం ఏమంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఈ భాషలో అచ్చులూ ఉండవు. పాము బుసలు, క్లిక్‌ శబ్దాలతో కూడి ఉంటుందీ భాష. స్వరపేటికలోని తంత్రుల ప్రకంపనాలతో ఏర్పడుతుందన్నమాట.

ద్రుషెక్‌ అనే గ్రహాంతర వాసుల భాష ఈ ద్రిటోక్‌. వీరికి వోకల్‌ కార్డ్స్‌' ఉండవు. పొడవైన తోకలుంటాయి. బాగా గెంతగలవు. ద్రిటోక్‌లో 50 వరకూ తేడాలతో చేతి సంజ్ఙలూ ఉంటాయి. ఒక ఉదాహరణ చూడండి.. అర్థం చేసుకోవాల్సిన పనేమీ లేదు.. ద్రిటోక్‌ భాషలో “tr’w.cq.=P4=C3^Q3-pln.t’.” అంటే.. ‘‘The Drushek, he holds a cloak’’ అని అర్థం. ఈ భాషను ఎలా మాట్లాడతారో తెలుసుకోవాలంటే.. ఈ ఆడియో ఫైల్స్‌ వినండి.

4.లింకోస్‌:

గ్రహాంతర వాసులను వెతికేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ సెటీ శాస్త్రవేత్తలు రూపొందించారీ భాషను. భాష రాని వారికి కూడా అర్థమయ్యేలా చెప్పేందుకు ఉద్దేశించిన లింగ్వా ఫ్రాంకా భాషలు (ప్లెయిన్స్‌ ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌, వంటివి)లను ఖగోళానికి వర్తింపజేసి హాన్స్‌ ఫ్రాయిడెథాల్‌ లింగ్వా ​కాస్మికా అనే భాషను తయారు చేస్తే.. సెటీ శాస్త్రవేత్తలు దాన్ని మరింత అభివృద్ధి చేశారు. లింగ్వా కాస్మికా కాస్తా లింకోస్‌ అయ్యిందన్నమాట. 1960లోనే హాన్స్‌ ఫ్రాయిడెథాల్‌ ఈ భాషను తన పుస్తకం ‘లింకోస్‌’లో విశదీకరించారు. మనుషులు ప్రపంచాన్ని ఎలా చూస్తారో గ్రహాంతర వాసులకు వివరించేలా ఉంటుందీ భాష. అంకెలకు తగ్గ కాంతి పుంజాలు పంపడం. ప్రాథమిక గణిత శాస్త్ర గురుతులతో మొదలుపెట్టి... అతి సంక్లిష్టమైన ‘ప్రేమ’ అన్న భావనను వివరించే వరకూ సాగుతుంది లింకోస్‌. సెటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే లింకోస్‌ ఆధారంగా గ్రహాంతర వాసులను ఉద్దేశించి కొన్ని సందేశాలు పంపారు కూడా.

5. లిజెనా:

పీటర్‌ బ్లీక్‌లీ సిద్ధం చేసిన గ్రహాంతర వాసుల భాష ఈ లిజెనా. స్లైవియా సోటోమేయర్‌ తాలూకూ గ్రహాంతర భాష ‘క్లెన్‌’ స్ఫూర్తితో తయారైంది ఇది. క్రియల్లేని భాషగా దీనికి పేరు. కాకపోతే బ్లీక్‌లీ లిజెనాలో ప్రతి నామవాచకం క్రియగానూ పనిచేస్తుంది. 2015లో జరిగిన లాంగ్వేజ్‌ క్రియేషన్‌ కాన్ఫరెన్స్‌లో బ్లీక్‌లీ మాట్లాడుతూ లిజెనా మాట్లాడే గ్రహాంతర వాసుల గురించి తన ఆలోచనలను ఇలా పంచుకున్నారు. ‘‘లిజెనా మాట్లాడే వారు లీయెన్లు. పిల్లులకు మూతిమీద స్పర్థను గుర్తించగలిగే వెంట్రుకల్లాంటివి ఉంటే లీయెన్లకు అలాంటివి శరీరం మొత్తమ్మీద ఉంటాయి. ఈ లక్షణం వల్ల పరిసరాల్లో జరిగే అతిసూక్ష్మమైన మార్పులను కూడా ఇవి గుర్తించగలవు. దీనికి తగ్గట్టుగానే వారి లిజెనా కూడా ఉంటుంది’’ అని వివరించారు.

6. ఏయూఐ:

ఆస్ట్రియా సైకోఅనలిస్ట్‌ వూల్ఫ్‌గ్యాంగ్‌ జాన్‌ వీల్‌గార్ట్‌ రూపకల్పన ఈ ‘ఈయూఐ’ భాష. చిన్నప్పుడు ఓ గ్రహాంతర వాసి తన కలల్లో వచ్చి మాట్లాడిందన్న నమ్మకం ఆధారంగా వూల్ఫ్‌గ్యాంగ్‌ ఈ భాషను సిద్ధం చేశారు. 1930 40లలో నాజీల ప్రచారం హోరెత్తుతున్న తరుణంలో వూల్ఫ్‌గ్యాంగ్‌ ఆ నినాదాలను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. మనిషి మనసులను సబ్‌కాన్షస్‌ స్థాయిలో ప్రభావితం చేస్తాయీ నినాదాలని నమ్మేవాడు. ఈ నేపథ్యంలోనే 1958లో ఆయన ఈ ‘ఏయూఐ’ భాషను రూపొందించారు. కొన్ని గంటల్లో నేర్చుకోగల ఈ భాషను వూల్ఫ్‌గ్యాంగ్‌ ‘అంతరిక్ష భాష’గా అభివర్ణించడం గమనార్హం. ఈ ఏయూఐ భాషలో 31 సంకేతాలు ఉంటాయి. వీటి మేళవింపుతో కొత్త అర్థాలను సృష్టించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement